చిదంబరం బడ్జెట్ 2013 14... ధరలు పెరిగేవి.. తగ్గేవి ఏంటి?
, గురువారం, 28 ఫిబ్రవరి 2013 (19:32 IST)
వార్షిక బడ్జెట్ 2013 14ను లోక్‌సభలో ఆర్థిక మంత్రి చిందబరం గురువారం ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ తర్వాత అంటే వచ్చే ఏప్రిల్ నెల నుంచి సెల్‌ఫోన్లు, సెట్‌టాప్ బాక్సులు, సిగరెట్లు, విలాసవంతమైన కార్లు, బైక్‌ల ధరలు విపరీతంగా పెరగనున్నాయి. అదేసమయంలో తోలు వస్తువులు, పాదరక్షలు, రెడిమేడ్ దుస్తుల ధరలు, ఆభరణాల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. మొబైల్ ఫోన్లు ధరలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి భారీగా పెరగనున్నాయి. రూ.2000 వేలకు పైగా ధర కలిగిన మొబైల్ ఫోన్‌పై చిదంబరం ఏకంగా ఆరు శాతం పన్నును విధించారు. కొత్త మొబైల్ కొనాలంటే ఖచ్చితంగా ఈ పన్నును కొనుగోలుదారుడు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. అదేసమయంలో మద్యంపై ఆయన ఎలాంటి సర్వీసు పన్నులు విధించక పోవడంతో మద్యంబాబులు ఊరట చెందారు. ఆదాయ పన్ను పరిమితుల్లో ఎలాంటి మార్పు లేదు ఆదాయపు పన్నుకు సంబంధించి గతంలో ఉన్న స్లాబుల్లో ఎలాంటి మార్పు లేదని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం తెలిపారు. వార్షిక ఆదాయం రూ.2.20 లక్షల లోపు ఉన్న వారు ఆదాయపు పన్నులోకి రారని తేల్చి చెప్పారు. రూ.2.20 లక్షల నుంచి రూ. 5 లక్షల ఆదాయం ఉన్నవారిపై 10 శాతం పన్ను యథాతథంగా ఉంటుందని పేర్కొన్నారు. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల ఆదాయం ఉన్నవారిపై 20 శాతం పన్ను, రూ.10 లక్షలకు మించి ఆదాయం ఉన్నవారిపై 30 శాతం పన్ను యథాతథంగా ఉంటుందన్నారు. అయితే, రూ.కోటి ఆదాయం ఉన్న వారిపై 30 శాతం పన్నుతో పాటు అదనంగా ఈ యేడాది నుంచి 10 శాతం సర్‌ఛార్జ్ వసూలు చేయనున్నట్లు చిదంబరం ప్రకటించారు.