తమిళనాడు రాష్ట్రంలో అగ్రగామిగానున్న తమిళ టీవీ ఛానెల్ జయ టీవీ పది వసంతాలు పూర్తి చేసుకుని పదకొండవ సంవత్సరంలోకి అడుగు పెట్టింది.
జయ టీవీ పది సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని పదకొండవ సంవత్సరంలోకి అడుగు పెట్టిందని జయ టీవీ ప్రతినిధి చెన్నైలో విలేకరులకు తెలిపారు. తమ ప్రసారాలు తమిళనాడుతోపాటు ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. తాము ప్రత్యేకమైన, నాణ్యమైన ప్రసారాలను అందిస్తున్నామని, ప్రజలకు ఉపయోగపడే ప్రసారాలను అందిస్తున్నామని ఆయన వెల్లడించారు.
తాము అందించే కార్యక్రమాలు ప్రజలకు, విద్యార్థులకు, గృహిణులకు, ఉద్యోగులకు తదితర వర్గాల వారికి అందుబాటులో ఉండే విధంగా రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు. తాము ప్రసారం చేసే కార్యక్రమాల్లో భాగంగా అరుళ్ నేరమ్, తితిదేకు సంబంధించిన ప్రత్యేక ప్రసారాలు, బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష ప్రసారాలు, కుష్బుచే నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం జాక్‌పాట్, విసువిన్ మక్కల్, ఆరంగమ్ తదితర కార్యక్రమాలు ప్రసారం చేసామని ఆయన వెల్లడించారు.
జయ నెట్‌వర్క్‌లోని రెండు ప్రత్యేక ఛానెల్స్ జయ ప్లస్, జయ మ్యాక్స్ ఛానెల్స్‌ను గడచిన దశాబ్దంలో ప్రారంభించామని ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలను ప్రసారం చేసేందుకు వినూత్నమైన ప్రణాళికలను రూపొందించుకున్నామని ఆయన వెల్లడించారు.