తనకు కోట్ల ఆస్థి ఉన్నా చాలా ఒదిగి ఉండి టాలెంట్‌ను ప్రోత్సహించే ఉన్నత వ్యక్తి రామోజీరావు తనయుడు సుమన్ అని ఈటీవీలో కొంత కాలం పనిచేసిన ప్రభాకర్ వ్యాఖ్యానించారు. మా స్నేహం చెక్కుచెదరనిది. ఈ టీవీ నుండి బయటకు వచ్చాక ఏవేవో పుకార్లు షికార్లు చేశాయి.
ఏడాది పాటు ఖాళీగా ఉన్నా, ఏం చేయాలో తోచలేదు. టీవీ ఫీల్డులోనే ఉండాలని సీరియల్స్ తీయాలని అనుకున్నానని తెలిపారు. అందుకే సుమన్ పేరు మీదుగా సుమనోహర ప్రొడక్షన్స్ స్థాపించాను. దీని ద్వారా సీరియల్స్, సినిమాలు నిర్మిస్తానని ప్రభాకర్ వివరించారు.
తాజాగా జీటీవీలో 'ముద్దుబిడ్డ' సీరియల్‌ను ప్రభాకర్ తన స్వీయ నిర్మాణ, దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ సీరియల్ ఈ నెల 25వ తేదీ నుండి రాత్రి 8గంటలకు జీటీవీలో ప్రసారం కానుంది. ఈవిషయాలను వెల్లడించడానికి ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ముందుగా సీరియల్‌లో నటించిన నటీనటులను పరిచయం చేశారు. ప్రభాకర్ స్థాపించిన సుమనోహర ప్రొడక్షన్స్ లోగోను ప్రముఖ టీవీ సీరియల్ దర్శకురాలు మంజులానాయుడు ప్రారంభించారు. ముద్దుబిడ్డ హోర్డింగ్ శ్యాంపిల్స్‌ను నటుడు బ్రహ్మాజీ విడుదల చేశారు.
ప్రభాకర్ మాట్లాడుతూ.. టీవీ ప్రేక్షకులకు కనిపిస్తూ మాయమయిపోయాను. ఈటీవీ నుండి వచ్చాక ఒక ఏడాది పాటు నాకు గ్యాప్ వచ్చింది. ఆ సమయంలోనే నేను జీటీవీ వారి వద్దకు వెళ్లి ఓ ప్రాజెక్ట్ ఇవ్వమని కోరినట్లు తెలిపారు. జీటీవీ సీఈఓ సంజయ్ రెడ్డి ఇందుకు అనుమతిచ్చారని ప్రభాకర్ అన్నారు.