ఒక వ్యక్తి కడుపులో స్టేషనరీ షాపునే పెట్టుకున్నాడు. ఒక వ్యక్తి కడుపులో ఏకంగా 29 స్టీల్ స్పూన్లు, 19 టూత్‌బ్రష్‌లు, రెండు పెన్నులు వుండటం గమనించిన వైద్యులు షాకయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
వివరాల్లోకి వెళితే.. హాపుర్‌కు చెందిన 35 ఏళ్ల సచిన్‌ను అతని కుటుంబ సభ్యులు ఘజియాబాద్‌లోని ఒక డీ-అడిక్షన్ సెంటర్‌లో చేర్పించారు. అయితే, తనను అక్కడ వదిలి వెళ్లడం, సెంటర్‌లో సరైన ఆహారం పెట్టకపోవడంతో సచిన్ తీవ్రమైన కోపానికి గురయ్యాడు.
ఆకలికి సరిగ్గా అన్నం పెట్టకపోవడంతో వంటగదిలోని స్టీల్ స్పూన్లను దొంగిలించి, బాత్రూమ్‌లోకి తీసుకెళ్లేవాడు. వాటిని ముక్కలుగా విరిచి, నోట్లో పెట్టుకుని నీళ్ల సహాయంతో గొంతులోకి తోసేసుకునేవాడు. ఇలా స్పూన్లతో పాటు టూత్‌బ్రష్‌లు, పెన్నులను కూడా మింగడం ప్రారంభించాడు.
కొన్ని రోజుల తర్వాత తీవ్రమైన కడుపునొప్పి రావడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. ఎక్స్-రే, సీటీ స్కాన్ తీసిన వైద్యులు, అతని కడుపులో పేరుకుపోయిన వస్తువులను చూసి షాక్‌కు గురయ్యారు.
ఆపై శస్త్ర చికిత్స చేసి వాటిని బయటికి తీశారు. సచిన్ మానసిక స్థితి సరిగ్గా లేదని.. అందుకే ఇలాంటి పనులు చేశాడని.. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా వుందని తెలిపారు.