ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అనీ, నగర నిర్మాణం కోసం 30 వేల ఎకరాలను గత ప్రభుత్వం సమీకరించింది. ఐతే ఆ భూముల్లో రాజధాని నిర్మాణం సురక్షితం కాదంటూ మంత్రి బొత్స సత్యనారాయణ వాదిస్తూ వస్తున్నారు. మరోవైపు అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలన్నీ ఎక్కడికక్కడే ఆగిపోయాయి. అక్కడ పనులు చేసే కార్మికులు కూడా వెళ్లిపోయారు. అలా అమరావతి రాజధాని నగరంలో నిర్మాణాలు ఆగాయి.
ఇక అసలు విషయానికి వస్తే, కొత్తగా ఏపీ రాజధాని అమరావతి నుంచి నేరుగా మంగళగిరికి మార్చుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వెలగపూడిలో వున్న కార్యాలయాలను మంగళగిరికి తరలించాలన్న యోచనలో జగన్ సర్కార్ వున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం కూడా అదేనని అంటున్నారు. అమరావతి రాజధాని ఏపీకి అనువైంది కాదనీ, మంగళగిరి అయితే అన్నివిధాలా సరిపోతుందని వైసీపీ నాయకులు అంటున్నారు.
ఈ నేపధ్యంలో త్వరలో మంగళగిరి ఏపీ రాజధానిగా నిర్ణయిస్తూ ప్రకటన వెలువడే అవకాశం వుందంటున్నారు. అంతేకాదు... హైకోర్టును కర్నూలుకి తరలించాలనీ, ఇతర ముఖ్యమైన కార్యాలయాలను విశాఖలో పెట్టేందుకు గల అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.