Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బీజేపీలోకి తెలుగుదేశం మహిళా ఫైర్‌బ్రాండ్లు?

బీజేపీలోకి తెలుగుదేశం మహిళా ఫైర్‌బ్రాండ్లు?
, సోమవారం, 19 ఆగస్టు 2019 (18:15 IST)
తెలుగుదేశం పార్టీలో మహిళా ఫైర్‌బ్రాండ్లుగా పేరుగాంచిన యామిని సాధినేని, సినీ నటి దివ్యవాణిలు పార్టీ మారబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే యామిని సాధినేని బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జి కన్నా లక్ష్మీనారాయణతో భేటీ అయ్యారు కూడా. ఈ నేపథ్యంలో మరో మహిళా నేత దివ్యవాణి కూడా బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 
 
నిజానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా బంపర్ మెజార్టీతో గెలిచింది. వైకాపా ఫ్యాను గాలికి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన అభ్యర్థులంతా చిత్తుగా ఓడిపోయారు. అదేసమయంలో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చే వలసలను ఏమాత్రం ప్రోత్సహించడం లేదు. దీంతో అనేక మంది నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే అనేక మంది నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కోవలో ఇపుడు యామిని సాధినేని, దివ్యవాణిలు కూడా చేరబోతున్నారట. 
 
నిజానికి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత వీరిద్దరూ తెరపైకి వచ్చిందే లేదు. దాంతో వారు పార్టీ మారుతున్నారంటూ సాగుతున్న ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్టయింది. కొన్నిరోజుల క్రితం యామిని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణను కలవడంతో ఆమె కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమంటూ కథనాలు వెల్లువెత్తాయి. దీనిపై యామిని నుంచి మౌనమే సమాధానమైంది. 
 
మామూలు కార్యకర్తగా పార్టీలోకి వచ్చిన ఆమె వైసీపీ అధినేత జగన్‌పైనా, ఆ పార్టీ నేతలపైనా తీవ్రస్థాయిలో విమర్శలు చేసి టీడీపీ అధిష్ఠానం దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనే ఆమెకు అధికార ప్రతినిధిగా హోదా ఇచ్చారు. దాంతో మరింత విజృంభించిన యామిని జనసేనాని పవన్ కల్యాణ్‌పై భారీ స్థాయిలో విరుచుకుపడింది. పవన్-మల్లెపూలు ఎపిసోడ్‌తో ఆమెకు ఎక్కడలేని పాపులారిటీ వచ్చింది. ఓ దశలో ఆమె పార్టీ టికెట్ ఆశించినట్టు వార్తలు వినిపించాయి. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీ పరంగా ఆమె నుంచి ఎలాంటి స్పందనలేదు.
 
మరోవైపు, దివ్యవాణి కూడా చాలాకాలంగా మీడియా ముందుకు రావడంలేదు. ఎన్నికల ముందు వైసీపీ నేతలను కడిగిపారేసిన దివ్యవాణి, ఎన్నికల ఫలితాల తర్వాత ఓ రెండుమూడు సార్లు హడావుడి చేసింది తప్ప ఆపై తాను కూడా తెరమరుగైంది. ఆమె కూడా బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు టాక్ వినిపిస్తోంది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇండోపాక్ సరిహద్దుల్లో శత్రువుల తుపాకీ నీడలో దశాబ్దాలుగా పహరా... ఆ అనుభవం ఎలా ఉంటుంది?