ఆదివారం నాడు జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) ప్రాంగణంలో కొందరు దుండగులు ముసుగులు ధరించి వర్సిటీలోని వసతి గృహాల్లోకి చొచ్చుకెళ్లి కర్రలు, రాడ్లు, రాళ్లతో విద్యార్థులపై దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో విద్యార్థులతోపాటు వర్సిటీ విద్యార్థి సంఘం ప్రెసిడెంట్ ఆయిశీ ఘోష్ తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటన సమయంలో విద్యార్థులు ఎంత వారించినా దుండగులు వారి మాటలను పట్టించుకోలేదు. కర్రలతో కొడుతూ, అక్కడి ఫర్నీచర్ ఇతర సామగ్రిని ధ్వంసం చేస్తూ వీరంగం సృష్టించారు. ఈ దాడి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు నటి తాప్సి స్పందిస్తూ... ఏబీవీపీ సభ్యులే విద్యార్థులపై దాడి చేశారంటూ ఆరోపణలు గుప్పించారు. పిల్లల భవిష్యత్‌కు మంచి బాటలు పడాల్సిన చోట ఇలాంటి దారుణాలు జరగడం శోచనీయమనీ, బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనను హీరోయిన్ స్వరా భాస్కర్, షబానా అజ్మీ కూడా ఖండించారు.