Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

షెడ్యూల్ ప్రకారం "నీట్‌"గా పరీక్షలు : కేంద్రం స్పష్టీకరణ

షెడ్యూల్ ప్రకారం
, గురువారం, 27 ఆగస్టు 2020 (19:04 IST)
నీట్, జేఈఈ(మెయిన్) పరీక్షల నిర్వహణపై ప్రతిపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్  కీలక ప్రకటన చేశారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే ఈ పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు. 
 
నీట్, జేఈఈ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయన్నారు. జేఈఈ పరీక్షలకు సంబంధించి మొత్తం 8.58 లక్షల అడ్మిట్ కార్డులకుగానూ 7.5 లక్షల అడ్మిట్ కార్డులను అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకున్నట్లు ఎన్టీఏ (నేషనల్ టెస్ట్ ఏజెన్సీ) డైరెక్టర్ జనరల్ తనతో చెప్పారని విద్యా శాఖ మంత్రి వెల్లడించారు.
 
నీట్‌ పరీక్షకు సంబంధించి కూడా 15.97 లక్షల అభ్యర్థులకు గానూ 10 లక్షల మందికి పైగా అడ్మిట్ కార్డులను 24 గంటల్లో డౌన్‌లోడ్ చేసుకున్నారని మంత్రి చెప్పారు. విద్యార్థులు పరీక్షలు రాసేందుకు సుముఖంగా ఉన్నట్లు ఈ పరిణామం స్పష్టం చేస్తోందని, అందువల్ల యధావిధిగానే పరీక్షలు జరుపుతామని తెలిపారు.
 
కోవిడ్ నేపథ్యంలో జేఈఈ పరీక్ష కేంద్రాలను 570 నుంచి 660కి, నీట్ పరీక్షా కేంద్రాలను 2,546 నుంచి 3,842కి పెంచినట్లు ఆయన గుర్తుచేశారు. విద్యార్థుల ఎంపిక ప్రకారమే వారికి పరీక్ష కేంద్రాన్ని కేటాయించే అవకాశం కల్పించినట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 
 
కాగా, కరోనా వైరస్ దూకుడు ఏమాత్రం తగ్గకపోయినప్పటికీ కేంద్రం ఈ పరీక్షలకు మొగ్గు చూపడాన్ని ఖండిస్తూ, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ఎనిమిది రాజకీయ పార్టీలు కలిసి సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించిన విషయం తెల్సిందే. 
 
మరోవైపు, కొన్ని వర్గాల నుంచి వస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా నీట్, జేఈఈ పరీక్షలను మరింతకాలం పాటు వాయిదా వేస్తే, విద్యార్థుల భవిష్యత్తు విషయంలో సర్దుకుపోయినట్టు అవుతుందని వివిధ భారత, విదేశీ యూనివర్శిటీలకు చెందిన 150 మంది అకడమీషియన్లు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.
 
కాగా, "తమ రాజకీయ అజెండాను అమలు చేసేందుకు కొందరు విద్యార్థులను, కరోనాను అడ్డు పెట్టుకుంటున్నారు. విద్యార్థులు, యువతే దేశ భవిష్యత్తు. కరోనా కారణంగా ఇప్పటికే వారు విద్యపరంగా ఈ సంవత్సరం అనిశ్చితిలో పడిపోయారు. పై తరగతుల్లో అడ్మిషన్లు, క్లాసుల ప్రారంభం వంటి వాటిపై సాధ్యమైనంత త్వరగా దృష్టిని సారించాలి" అని విద్యావేత్తలు పేర్కొన్నారు.
 
ప్రతి సంవత్సరంలానే, ఈ సంవత్సరం కూడా లక్షలాది మంది ఇంటర్ పాస్ అయి, తదుపరి డిగ్రీ కళాశాలల్లో ప్రవేశం కోసం వేచి చూస్తున్నారని గుర్తు చేసిన వీరు, ఇప్పటికే నీట్, జేఈఈ పరీక్షల నిర్వహణ ఆలస్యం అయిందని, మరింత ఆలస్యమైతే యువత కలలు చెదిరిపోతాయని అభిప్రాయపడ్డారు.
 
ఢిల్లీ యూనివర్శిటీ, ఐగ్నోవ్, లక్నో యూనివర్శిటీ, జేఎన్యూ, ఐఐటీ ఢిల్లీ, యూనివర్శిటీ ఆఫ్ లండన్, యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, ది హీబ్రూ యోనివర్శిటీ ఆఫ్ జరూసలేం తదితర వర్శిటీల ప్రొఫెసర్లు ఈ లేఖపై సంతకాలు చేయడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో బ్రాడ్ బ్యాండ్ సేవలు మరింత సులభతరం