సూర్యగ్రహణం సమయంలో కర్ణాటక రాష్ట్రంలో అమానుష ఘటన చోటుచేసు కుంది. చిన్నారులకు అంగవైకల్యం పోతుందనే మూఢనమ్మకంతో చిన్నారులను మట్టిలో పాతిపెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. సూర్యగ్రహణం సమయంలో మట్టిలో పాతి పెడితే చిన్నారుల అంగవైకల్యం పోతుందని తల్లిదండ్రులకి ఎవరో చెప్పగా అది నిజమే అనుకున్నారు. మట్టిలో పాతిపెడితే మంచిదని అలా చేయడం వలన వారి అంగవైకల్యం పోవచ్చనే నమ్మకంతో మట్టిలో పాతిపెట్టారు.
అంగవైకల్యం కలిగిన పిల్లలను గొంతు వరకు మట్టిలో కప్పి పెట్టారు తల్లిదండ్రులు, స్థానికులు.
ఈ ఘటన ఉత్తర కర్ణాటకలోని తాజ్‌సుల్తాన్‌పురాలో చోటుచేసుకుంది. పిల్లలు రోదిస్తున్నప్పటికీ గ్రహణం ముగిసే వరకు అంటే సుమారు మూడు గంటల పాటు పిల్లలను వారి తల వరకు మట్టిలోనే కప్పి ఉంచారు. అయితే ఉత్తర కర్ణాటక అంతటా ఇదే మూఢాచారం కొనసాగుతోందట.
అయితే ఈ ఘటన పైన జన విజ్ఞాన వేదిక అసహనం వ్యక్తం చేసింది. చిన్నారులను మట్టిలో పాతిపెడితే శ్వాస తీసుకునే క్రమంలో ఇబ్బందులు పడతారని అన్నారు. తల్లిదండ్రులు ఈవిధమైన మూఢ విశ్వాసాలను విడనాడాలని సూచిస్తున్నారు. స్థానికులకు ఈ మూఢ నమ్మకం నుంచి బయట పడేసేందుకు అనేకమంది ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేదని అంటున్నారు.