జనసేన పార్టీకి చెందిన 400 ఖాతాలను ట్విట్టర్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఈ ఖాతాలన్నీ జనసేన పార్టీకి చెందిన శతఘ్ని ఖాతాతో అనుసంధానమై ఉన్నాయి. ఈ చర్యపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు.
జనసేనకు మద్దతిస్తున్న 400 ట్విట్టర్ ఖాతాలను ఎందుకు సస్పెండ్ చేశారో అర్థం కావడం లేదు. నిస్సహాయులైన ప్రజల తరపున నిలబడుతున్నందుకే ఇలా చేస్తున్నారా? మేం ఎలా అర్థం చేసుకోవాలి? అంటూ నిలదీశారు. అంతేకాకుండా బ్రింగ్‌బ్యాక్‌జేఎస్‌పిసోషల్‌మీడియా అనే హ్యాష్ ట్యాగ్‌ను జోడించారు.
మరోవైపు, యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా సాగుతున్న సేవ్ నల్లమల ఉద్యమంలో ముందున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పర్యావరణ పరిరక్షణపై వరుస ట్వీట్లు చేస్తున్నారు. ప్రకృతితో మమేకమవ్వాలన్న విషయాన్ని బలంగా చెబుతున్న ఆయన.. దానికి సంబంధించిన సుప్రసిద్ధ పుస్తకాలను తన ట్వీట్ల ద్వారా పరిచయం చేస్తున్నారు.
తాజాగా ఆయన ప్రఖ్యాత ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త మసనోబు ఫుకుఒకా రాసిన 'గడ్డిపరకతో విప్లవం' (వన్ స్ట్రా రెవల్యూషన్) పుస్తకం గురించి ట్వీట్ చేశారు. ప్రకృతితో అనుసంధానమై వ్యవసాయం ఎలా చేయాలో చెప్పే స్ఫూర్తిదాయకమైన పుస్తకమని పేర్కొన్నారు. ప్రకృతిమాత గురించిన లోతైన నిజాలను అర్థమయ్యేలా చేస్తుందన్నారు.
జపాన్‌కు చెందిన మసనోబు.. తన జీవితమంతా ప్రకృతి వ్యవసాయంపై కృషి చేశారు. కృతిమ పద్ధతులకు స్వస్తి చెప్పి.. సహజ పద్ధతుల్లో వ్యవసాయం చేసి.. అద్భుతాలు సృష్టించారు. ప్రపంచానికి ప్రకృతి వ్యవసాయం మహత్వాన్ని తెలియజేశారు. ఆయన అనుభవాలే వన్ స్ట్రా రెవల్యూషన్ అని చెప్పుకొచ్చారు.