సోషల్ మీడియా, స్మార్ట్‌ఫోన్లు విరివిగా వాడటం మొదలయ్యాక.. ఇటీవల ఏ చిన్న విషయాన్నైనా.. వీడియో రూపంలో పోస్టు చేయడం ఫ్యాషనైపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల పిల్లలు చేసే చిలిపి చేష్టలను వారి తల్లిదండ్రులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఇప్పటికే పలు చిన్న పిల్లల డ్యాన్సులు, డైలాగులకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే.
తాజాగా తమిళనాట ఓ వీడియో మెగా వైరల్ అవుతోంది. ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్లో ఓ పిల్లాడు చెప్పిన డైలాగులు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. అదేంటంటే... ''నాకు భోజనమే ముఖ్యం'' అని ఓ పిల్లాడు చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వీడియో తీసిన ఓ వ్యక్తి ''నువ్వు యువ సంఘంలో చేరిపోయావ్.. వెళ్లి మీ అమ్మ వద్ద రూ.2వేలు విరాళం తీసుకురా..'' అంటాడు.
వెంటనే ఆ పిల్లాడు ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతాడు. అలా వెళ్తున్న పిల్లాడి వద్ద మళ్లీ వీడియో తీసే వ్యక్తి.. ''నువ్వు ఇంటికెళ్లి తిరిగి వస్తావా" అని అడిగాడు. అందుకు ఆ పిల్లాడు భోంజేసి వస్తానని చెప్తాడు. వెంటనే అందరూ నవ్వడం మొదలెట్టారు.
"నువ్వు సంఘంలో చేరిపోయావ్.. భోంజేసి వస్తానంటున్నావ్.. నీకు సంఘం ముఖ్యమా.. భోజనం ముఖ్యమా..?" అని అడుగుతాడు. అందుకు ఆ పిల్లాడు టక్కున "భోజనమే ముఖ్యం.. భోంజేయకపోతే ఆకలేస్తుందిగా.." అంటూ ఏడ్వటం మొదలెట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం తమిళనాట వైరల్ అవుతోంది. ఈ పిల్లాడి పేరు ప్రణవ్ అని.. ప్రస్తుతం ఈ పిల్లాడు చెప్పిన డైలాగులతో డబ్‌స్మాష్‌లు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో మీరూ ఓ లుక్కేయండి.