అప్పుడు చేవెళ్ల చెల్లెమ్మకి హోం శాఖ... ఇప్పుడు నగరి రోజమ్మకి అదే శాఖ...

శుక్రవారం, 7 జూన్ 2019 (17:39 IST)
ఆర్కే రోజా. వైసీపీలో కీలక నాయకురాలు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో తను కూడా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. తన సొంత నిధులతో నగరి నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రంలో ఇతరచోట్ల కూడా తాగునీరు అందించారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడారు. అలా మొదటి నుంచి జగన్ మోహన్ రెడ్డి వెన్నంటే నడిచారు రోజా.
 
నగరి నియోజకవర్గం నుంచి రోజా 2014లో, 2019 ఎన్నికల్లో కూడా గెలుపొందారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలి హోదాలో ఆమె రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. మహిళలపై జరుగుతున్న దాడులపై చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. తెదేపా నాయకులు రోజా అంటే భయపడేట్లు చేశారు. అంతేకాదు.. కాల్ మనీ సెక్స్ రాకెట్ సమస్యలపై అసెంబ్లీలో ఆమె చేసిన పోరాటానికి ఫలితంగా ఏడాదిపాటు అసెంబ్లీ బహిష్కరణకు గురయ్యారు. ఇలా ప్రజా సమస్యల కోసం ఆమె పోరాడారు. 
 
పార్టీలో కీలక నాయకురాలిగా పేరున్న రోజాకి సీఎం తర్వాత స్థానం అని చెప్పబడే హోం శాఖ మంత్రిగా నియమిస్తారన్న వార్తలు వస్తున్నాయి. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సబితా ఇంద్రారెడ్డిని హోంమంత్రిగా నియమించి చరిత్ర సృష్టించారు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి కూడా ఆయన బాటలోనే నడుస్తూ రోజాకి ఆ పదవి కట్టబెట్టే అవకాశాలు పుష్కలంగా వున్నాయంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం డేటింగ్ యాప్స్ వాడే వాళ్లు అందం కోసం ఏం చేస్తున్నారో తెలుసా?