Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వరః- గురుపూజోత్సవం

గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వరః- గురుపూజోత్సవం
, బుధవారం, 4 సెప్టెంబరు 2019 (14:59 IST)
"గురు బ్రహ్మ, గురు విష్ణు 
గురు దేవో మహేశ్వరః 
గురు సాక్షాత్ పరబ్రహ్మ 
తస్మై శ్రీ గురవే నమః"
 
మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతి అడుగులోనూ, ప్రతిక్షణంలోనూ అతను ఏదో క్రొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. అతడు నేర్చుకునే ప్రతి అంశం వెనుక గుప్తంగా ఒక గురువు దాక్కునే వుంటాడు. కానీ ఆ గురువుని మనమందరం ప్రత్యక్షంగా చూడగలిగేది తరగతి గదిలో విద్యనభ్యసించినప్పుడే..!
 
ప్రతి విద్యార్థి గురువును దైవంగా భావిస్తూ.. తన భవిష్యత్తుకు ఆయన అనుభవాన్ని వారధిగా చేసుకుని ముందుకు సాగుతాడు. జీవితంలో ఎవరికీ కేటాయించనంత సమయాన్ని గురువువద్ద గడుపుతాడు. అలా తమ జీవితాలకు ఓ రూపం కల్పించి, తీర్చిదిద్దే గురువులనే ప్రత్యక్ష దైవాలను... విద్యార్థులు ప్రేమగా పూజించేందుకు, స్మరించుకునేందుగానూ సెప్టెంబర్ 5వ తేదీని "ఉపాధ్యాయ దినోత్సవం"గా "గురు పూజోత్సవం"గా జరుపుకుంటున్నారు.
 
ఈ సందర్భంలో ఉపాధ్యాయవృత్తికి అపారమైన గౌరవాన్ని తెచ్చిపెట్టిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి కాస్తంత తెలుసుకుందాం..! రాధాకృష్ణన్ తమిళనాడులోని తిరుత్తణిలో 1888వ సంవత్సరం సెప్టెంబర్ ఐదో తేదీన జన్మించారు. పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఆయన విద్యాభ్యాసం అనేక ఒడిదుడుకుల మధ్య కొనసాగింది. తత్వశాస్త్రంపై మక్కువతో అదే ప్రధానాంశంగా ఎమ్.ఎ. విద్యాభ్యాసంలో థీసిస్‌గా "ది ఎథిక్స్ ఆఫ్ వేదాంత"ను తన 20వ ఏటనే సమర్పించిన ప్రతిభాశాలి రాధాకృష్ణన్. 
 
అనంతరకాలంలో ఆయన అధ్యాపక వృత్తిలో కొనసాగుతూనే పలు మతాల తత్వసారాన్ని ఆకళింపు చేసుకున్నారు. రాధాకృష్ణన్ రచనల్లో ఒకటైన "ఇండియన్ ఫిలాసఫీ" భారతీయ తత్వశాస్త్ర వినీలాకశంలో ధృవతారగా నిలిచిపోయింది. విదేశాలలో తాను చేసిన తత్వ శాస్త్ర సంబంధిత ప్రసంగాలలో భారతదేశానికి స్వాతంత్ర్యం రావల్సిన ఆవశ్యకతను ప్రస్తావించేవారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌ పదవిని చేపట్టిన ఆయన విశ్వవిద్యాలయాన్ని సంక్షోభంలోంచి బయటపడేశారు.
 
దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ప్రభుత్వంలో పలు కీలక బాధ్యతలను నిర్వహించిన రాధాకృష్ణన్... విద్యా రంగంలో పలు నిర్ణయాత్మక సంస్కరణలకు మార్గదర్శకులయ్యారు. తన అనిర్వచనీయమైన సేవలకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక భారత రత్న పురస్కారం ఆయనను వరించింది. 1962వ సంవత్సరంలో దేశంలో అత్యుత్తమైన రాష్ట్రపతి పదవికి డాక్టర్ రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. పదవిలో ఉన్న ఐదు సంవత్సరాలలో తలెత్తిన సంక్షోభాలకు తనదైన శైలిలో పరిష్కారం చూపారు.
 
ఇదే సందర్భంలో కొంతమంది శిష్యులు మరియు మిత్రులు... రాధాకృష్ణన్ పుట్టిన రోజును జరిపేందుకు ఆయన వద్దకు వచ్చారట. అప్పుడు ఆయన మాట్లాడుతూ.. "నా పుట్టిన రోజును వేరుగా జరిపే బదులు, దానిని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తే తానెంతగానో గర్విస్తాన"ని చెప్పారట. ఈ రకంగా ఉపాధ్యాయ వృత్తిపై తన ప్రేమను చాటుకున్న రాధాకృష్ణన్ కోరిక మేరకే ఆనాటి నుంచి ఆయన పుట్టిన రోజును భారతదేశంలో "ఉపాధ్యాయ దినోత్సవం"గా జరుపుకుంటున్నాం.
 
తాను చేపట్టిన రంగంలో అద్వితీయ ప్రతిభను కనపర్చే రాధాకృష్ణన్ తన 79వ ఏట.. 1975వ సంవత్సరం, ఏప్రిల్ 17న చెన్నై నగరంలో కన్నుమూసారు. విశ్వవిఖ్యాత తాత్వికుడిగా, ఆదర్శ ఉపాద్యాయుడిగా అందరి మన్ననలు చూరగొన్న సర్వేపల్లి కనుమరుగైనా.. ఆయన భావనలు.. నాడు, నేడు, మరెప్పటికీ అధ్యాపక లోకానికి స్పూర్తిగా నిల్చిపోతాయి. తనలోని జ్ఞానసంపదను విద్యార్థులకు పంచడం ద్వారా వారి భావి జీవితానికి బంగారు బాటను వేసిన గురుదేవుడిగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అందరి మనసుల్లో చిరస్మరణీయులుగా నిలిచిపోతారు.
 
ఇకపోతే... సమాజ నిర్మాణంలో కీలకపాత్ర వహించే ఉపాధ్యాయుడి పేరు మీద ఒక ప్రత్యేక రోజుని ఏర్పాటు చేసి ఆ వృత్తిని గౌరవిస్తుండడం మన సంస్కృతిలో నేడు అంతర్భాగమై పోయింది. ఇది ఎంతైనా గర్వించతగ్గ విషయం. ఇది సర్వత్రా వాంఛనీయం. ఈ రోజుని ప్రతి విద్యాలయంలోనూ ఎంతో ఘనంగా నిర్వహించాలి. ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించడం ద్వారా వారి సేవలను గౌరవించాలి. వారి ఆదర్శాలను అనుసరించాలి. విద్యార్ధి సంఘానికి "దేహం" వంటివాడైతే ఉపాధ్యాయుడు "ఆత్మ". అటువంటి ఉపాధ్యాయుడిని ప్రతి యేటా సత్కరించుకోవాల్సిన బాధ్యత విద్యార్ధుల మీదే కాదు, సమాజం మీద కూడ ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విలువలతో కూడిన సమాజానికి పునాదులు వేయాలి : మంత్రి బొత్స