Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లాక్‌డౌన్ కాలంలో బయటకొస్తే ఇకపై బెండు తీస్తారు... విధించే శిక్షలు ఇవే...

Advertiesment
లాక్‌డౌన్ కాలంలో బయటకొస్తే ఇకపై బెండు తీస్తారు... విధించే శిక్షలు ఇవే...
, సోమవారం, 13 ఏప్రియల్ 2020 (09:50 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రకాలైన చర్యలు చేపడుతున్నాయి. ముఖ్యంగా, ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశ వ్యాప్త లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. అయితే, లాక్‌డౌన్ సమయంలో ప్రజలు యధేచ్చగా రోడ్లపైకి తిరుగుతున్నారు. ఈ లాక్‌డౌన్ కఠినంగా అమలవుతున్న ప్రాంతాల్లో మాత్రం వైరస్ కేసులు తగ్గుముఖం పడుతుంటే.. లాక్‌డౌన్ పెద్దగా పాటించని ప్రాంతాల్లో మాత్రం కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీచేసింది. ఒకవేళ లాక్‌డౌన్ ఆంక్షలను ఉల్లంఘించి ఎవరైనా రోడ్డుపైకి వస్తే వారి బెండు తీయడమే కాదు... వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, శిక్షించనున్నారు. 
 
ప్రభుత్వం చెప్పేది తమకు కాదన్నట్టుగా వ్యవహరిస్తూ ముప్పు మరింత పెరిగేలా చేస్తుండటంతో కేంద్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ చట్టం - 2005ను అమలులోకి తీసుకొచ్చారు. ఈ చట్టంలో ప్రధానంగా సెక్షన్‌ 51 నుంచి సెక్షన్‌ 60 వరకు వివిధ నేరాలు, వాటి శిక్షలను నిర్వచించారు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొంటున్న నేపథ్యంలో ఈ చట్టంలోని సెక్షన్లు, శిక్షల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. 
 
* సెక్షన్‌ 51 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన నిబంధనలను సరైన కారణం లేకుండా అతిక్రమించేవారికి యేడాది జైలుశిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది. నిర్లక్ష్యం కారణంగా ఎవరైనా ప్రాణాలు కోల్పోయినా, ఆపద వాటిల్లే పరిస్థితి ఉత్పన్నమైనా సదరు వ్యక్తికి రెండేండ్ల వరకు జైలుశిక్ష విధించే అవకాశం ఉన్నది. 
 
* సెక్షన్‌ 52 : ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చి అధికారుల నుంచి ఏదైనా సాయం పొందినా, ఏవైనా పనులు చేయించుకున్నా వారికి రెండేండ్ల వరకు జైలుశిక్ష విధించే అవకాశం ఉంది. కొన్నిసార్లు జరిమానా, జైలుశిక్ష రెండూ విధించవచ్చు. 
 
* సెక్షన్‌ 53 : విపత్తును అరికట్టేందుకు ఉపయోగించే వస్తువులు లేదా నగదును ఎవరైనా దుర్వినియోగం చేసినా, లేదా పారబోసినా అలాంటి వ్యక్తులకు రెండేండ్ల వరకు జైలుశిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధిస్తారు. 
 
* సెక్షన్‌ 54 : ప్రజలను గందరగోళపరిచేలా, ఆందోళన కలిగించేలా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసేవారికి గరిష్టంగా రెండేండ్ల వరకు జైలు, జరిమానా లేదా రెండూ శిక్షలు విధిస్తారు. 
 
* సెక్షన్‌ 56 : విధినిర్వహణలో విఫలమైనా, అనుమతి లేకుండా విధుల నుంచి తప్పుకొన్నా, ఈ చట్టం కింద ప్రభుత్వం అప్పగించిన బాధ్యతల అమలులో విఫలమైనా, లేదా ఉన్నతాధికారుల అనుమతి లేకుండా విధుల నుంచి వైదొలగినా గరిష్టంగా ఏడాది వరకు జైలు, జరిమానా విధించే అవకాశం ఉన్నది. 
 
* సెక్షన్‌ 55 : ప్రభుత్వ అధికారి / ఏదైనా విభాగం ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలకు ఆదేశించవచ్చు. తనకు తెలియకుండానే ఆ తప్పు జరిగినట్టు నిరూపించే ఆధారాలు సమర్పిస్తే విచారణ నుంచి మినహాయింపు ఉంటుంది. 
 
* సెక్షన్‌ 57, 58 : విపత్తు నిర్వహణ చట్టం-2005 నిబంధనలను ఏదైనా కంపెనీ లేదా కార్పొరేట్‌ బాడీ ఉల్లంఘించినట్టు నిరూపితమైతే ఆ కంపెనీ డైరెక్టర్‌, మేనేజర్‌, ఆ సమయంలో విధుల్లో ఉన్న సిబ్బందికి ఏడాది జైలుశిక్ష, జరిమానా విధిస్తారు. 
 
* సెక్షన్‌ 59 : సెక్షన్‌ 55, 56ల కింద నమోదైన కేసుల ప్రాసిక్యూషన్‌కు వినియోగిస్తారు. 
 
* సెక్షన్‌ 60 : ఈ  చట్టం పరిధిలోని అంశాల్లో కోర్టులు నేరుగా కలుగజేసుకునే అవకాశం ఉండదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్‌లో యాక్టివ్ కరోనా కేసులెన్ని? తెలుగురాష్ట్రాల పరిస్థితేంటి?