Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాట్‌వెస్ట్ సిరీస్ గుర్తుందా? యూవీ - కైఫ్‌లా భాగస్వామ్యం నిర్మిద్దాం : మోడీ

Advertiesment
నాట్‌వెస్ట్ సిరీస్ గుర్తుందా? యూవీ - కైఫ్‌లా భాగస్వామ్యం నిర్మిద్దాం : మోడీ
, శనివారం, 21 మార్చి 2020 (16:25 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోమారు దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచాన్ని కమ్మేస్తున్న కరోనా వైరస్ విముక్త భారత్ కోసం ఆదివారం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ప్యూను పాటించనున్నారు. ఇందుకోసం దేశం మొత్తం సిద్ధమైంది. ఇలాంటి తరుణంలో ఆయన మరోమారు ట్విట్టర్ ద్వారా దేశ ప్రజల ముందుకు వచ్చారు. ఈ దఫా ఇంగ్లండ్ వేదికగా జరిగిన నాట్‌వెస్ట్ సిరీస్‌ను గుర్తుకు తెచ్చారు. 
 
ఈ సిరీస్ ఫైనల్లో భారత క్రికెటర్లు యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్‌లు కలిసి భారీ భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. వీరిద్దరి ఆటతీరును ప్రధాని మోడీ ఇపుడు గుర్తుచేశారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆ ఇద్దరు క్రికెటర్లు మొక్కవోని ధైర్యంతో క్రీజ్‌లో నిలబడి పరుగుల వర్షం ప్రవహించి.. జట్టును ఆదుకున్నారనీ, ఇపుడు కూడా దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందనీ, దేశ ప్రజలంతా కలిసి దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. 
 
ఇదే అంశంపై ఆయన ట్విట్టర్‌లో ఓ ట్వీట్ చేసారు. భారత మాజీ క్రికెటర్లు యువ్‌రాజ్‌, మహమ్మద్‌ కైఫ్‌ ఇంగ్లాండ్‌ వేదికగా 2002లో జరిగిన నాట్‌వెస్ట్‌ సిరీస్‌ ఫైనల్లో ఇంగ్లాండ్‌పై చెలరేగి ఆడి, భారత్‌కు భారీ విజయాన్ని సాధించిపెట్టారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు వారు చూపిన తెగువ అనిర్వచనీయమని తెలిపిన ప్రధాని.. ఇప్పుడు మనమంతా కూడా దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరమున్నదని అన్నారు. ఇందుకుగాను ఆదివారం ప్రజలంతా జనతా కర్ఫ్యూకు సహకరించి, కరోనా వైరస్‌ అరికట్టడంలో తమవంతు పాత్ర వహించాలని తెలిపారు.
 
ప్రధాని పిలుపునకు క్రికెటర్‌ కైఫ్‌ ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. దేశాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైనదనీ.. ప్రధాని సూచనలు పాటించి, మనల్ని మనం రక్షించుకుందామని కైఫ్‌ తెలిపారు. 
 
కాగా, 2002లో నాట్‌వెస్ట్‌ సిరీస్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో 326 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌.. ఇన్నింగ్స్‌ను అద్భుతంగానే ఆరంభించింది. అనంతరం పుంజుకున్న ఇంగ్లాండ్‌ బౌలర్లు 146 పరుగులకే 5 కీలక వికెట్లు పడగొట్టి మ్యాచ్‌లో పైచేయి సాధించారు. 
 
జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కైఫ్‌, యువరాజ్‌ పోరాడిన తీరు అద్భుతం. ఇద్దరు కలిసి ఆరో వికెట్‌కు 121 పరుగుల భాగస్వామ్యం సాధించిపెట్టారు. యువరాజ్‌ 69 పరుగులకు ఔటయినప్పటికీ.. కైఫ్‌ టెయిలెండర్ల సాయంతో రెండు వికెట్ల తేడాతో భారత్‌కు విజయాన్ని అందించాడు. 
 
దేశంలో ఇప్పటికే కరోనా వైరస్‌ మహమ్మారి బారిన 258 మంది పడగా.. వారిలో నలుగురు మృతిచెందారు. ఈ సంఖ్య పెరగకుండా జాగ్రత్త పడాలనీ.. ఈ మహమ్మారిని దేశంలో అంతమొందించాలని ప్రధాని పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ పిలుపునకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా ఎఫెక్ట్.. యూపీలో నిత్యావసరాల కోసం రూ.1000 సాయం