Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వాలంటీర్‌కు అనారోగ్యం... ఆగిపోయిన్ ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్

వాలంటీర్‌కు అనారోగ్యం... ఆగిపోయిన్ ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్
, బుధవారం, 9 సెప్టెంబరు 2020 (11:25 IST)
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని అంతం చేసేందుకు ప్రపంచ దేశాలు వివిధ రకాలైన ప్రయోగాల్లో నిమగ్నమైవున్నాయి. ఇలాంటివాటిలో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం - ఆస్ట్రాజెనికా సంయుక్తంగా చేపట్టిన ప్రయోగంలో ఎంతో పురోగతి కనిపించింది. ఈ రెండు సంస్థలు కలిసి తయారు చేసిన వ్యాక్సిన్‌ను పలువురు వాలంటీర్లకు ఇచ్చారు. వీరిలో ఒకరికి అనారోగ్యం చేసింది. దీంతో ఈ వ్యాక్సిన్ ట్రయల్స్‌ను నిలిపివేశారు. 
 
బ్రిటన్‌లో టీకా తీసుకున్న వ్యక్తి తీవ్ర అనారోగ్యం బారినపడటంతో, తుది దిశకు చేరిన క్లినికల్ ట్రయల్స్‌ను నిలిపివేశామని, వ్యాక్సిన్ భద్రతపై మరోమారు పూర్తిస్థాయిలో సమీక్షిస్తామని ఆస్ట్రాజెనికా ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, సదరు వాలంటీర్‌కు ఎటువంటి అనారోగ్య సమస్య ఏర్పడిందన్న విషయాన్ని మాత్రం సంస్థ పేర్కొనలేదు. 
 
మరోవైపు, కరోనా మహమ్మారిని అంతం చేసే వ్యాక్సిన్ విషయంలో తాము త్వరపడటం లేదని, అన్ని రకాలుగా సురక్షితమని తేలితేనే టీకాను అందుబాటులోకి తెస్తామని దిగ్గజ ఫార్మా సంస్థలు స్పష్టం చేశాయి. ఈ మేరకు పలు కంపెనీల సీఈఓలు ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. ఆస్ట్రాజెనికా, మోడెర్నా, ఫైజర్, నోవావ్యాక్స్, జాన్సన్ అండ్ జాన్సన్ తదితర కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఈ లేఖపై సంతకాలు చేయడం గమనార్హం.
 
తమకు ప్రజారోగ్యం, వారి భద్రతే ముఖ్యమని, వ్యాక్సిన్ ట్రయల్స్‌ను త్వరితగతిన పూర్తి చేయాలన్న ఆలోచన లేదని, దగ్గరి దారులను అనుసరించడం లేదని వారు స్పష్టంచేశారు. ఏ వ్యాక్సిన్ అయినా, పూర్తిగా సురక్షితమని తేలిన తర్వాతే ఆమోదం కోసం నియంత్రణా సంస్థలకు దరఖాస్తు చేస్తామని తెలిపారు. కాగా, ఈ లేఖలో చైనా, రష్యాలకు చెందిన ఫార్మా కంపెనీలు మాత్రం సంతకాలు చేయక పోవడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రికార్డు స్థాయిలో కరోనా వైరస్ కేసులు.. బ్రెజిల్ వెనక్కి నెట్టి రెండో స్థానానికి భారత్