Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిర్భయ కేసు : ఏడేళ్ళ నిరీక్షణకు తెరపడింది.. ముద్దాయిలకు ఉరి

నిర్భయ కేసు : ఏడేళ్ళ నిరీక్షణకు తెరపడింది.. ముద్దాయిలకు ఉరి
, శుక్రవారం, 20 మార్చి 2020 (06:43 IST)
ఎట్టకేలకు న్యాయం గెలిచింది. నిర్భయ తల్లి ఆశాదేవి ఏడేళ్ల నిరీక్షణకు తెర పడింది. నిర్భయపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హతమార్చిన నలుగురు నిందితులను శుక్రవారం ఉదయం నిముషాల క్రితం ఉరి తీశారు. సరిగ్గా తెల్లవారుజామున 5.30 నిముషాలకు తీహార్ జైలు అధికారులు నిందితులు నలుగురినీ ఉరి తీసినట్లు ప్రకటించారు.
 
నిర్భయ హత్యాచార కేసులో నలుగురు దోషులకు ఉరి తీసిన అనంతరం వైద్యులు పరిశీలించి వారు మరణించారని ధ్రువీకరించారు. శుక్రవారం ఉదయం నిర్భయ దోషులైన ముఖేశ్‌ సింగ్‌(32), వినయ్‌ శర్మ(26), అక్షయ్‌ ఠాకూర్‌ సింగ్‌(31), పవన్‌ గుప్తా(25)లకు ఉరివేసిన తర్వాత 30 నిమిషాల పాటు అలా ఉరికంబాలపై ఉంచారు. అనంతరం నలుగురు దోషులను కిందకు దించి వారిని వైద్యులు పరీక్షించగా నలుగురూ మరణించారని తేలింది. 
 
అంతకుముందు వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. దోషుల ఆరోగ్య పరిస్థితి బాగున్నట్టు నిర్ధారించారు. ఉరితీత నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టిన అధికారులు జైలును లాక్‌డౌన్ చేశారు. మరోవైపు, జైలు బయట జనం పెద్ద సంఖ్యలో గుమిగూడారు.
 
మీరట్ నుంచి వచ్చిన తలారి పవన్ నిర్భయ దోషులైన ముఖేశ్ సింగ్, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మలను ఉరితీశాడు. దక్షిణాసియా దేశంలోనే అతి పెద్దదైన తీహార్ జైలులో ఒకే నేరానికి సంబంధించి నలుగురిని ఉరితీయడం ఇదే తొలిసారి. ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు చివరి క్షణం వరకు దోషులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. 
 
చట్టపరంగా వారికి ఉన్న అన్ని హక్కులు ఉపయోగించుకున్నారు. అయినప్పటికీ ఊరట లభించలేదు. దీంతో ఘటన జరిగిన ఏడేళ్ల తర్వాత వారికి ఉరిశిక్ష అమలైంది. నిర్భయ దోషులకు మరణ దండన అమలు కావడంపై నిర్భయ తల్లిదండ్రులతోపాటు దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా వైరస్: ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించండి - ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు