Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆరోగ్య రంగంలో పెనుమార్పులు, దేశం మనవైపు చూడాలి: సీఎం జగన్

ఆరోగ్య రంగంలో పెనుమార్పులు, దేశం మనవైపు చూడాలి: సీఎం జగన్
, సోమవారం, 31 మే 2021 (20:29 IST)
వైద్య రంగంలో అమలు చేస్తున్న విప్లవాత్మక నిర్ణయాలలో భాగంగా, రాష్ట్ర వ్యాప్తంగా 16 మెడికల్‌ కాలేజీలు, వాటికి అనుబంధంగా నర్సింగ్‌ కళాశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 8 వేల కోట్ల రూపాయల వ్యయంతో విజయనగరం, పాడేరు, అనకాపల్లి, అమలాపురం, రాజమండ్రి, పాలకొల్లు,  ఏలూరు, మచిలీపట్నం, బాపట్ల, పిడుగురాళ్ల, మార్కాపురం, మదనపల్లె, పెనుకొండ, పులివెందుల, నంద్యాల, అదోనిలో వైద్య కళాశాలు ఏర్పాటు చేస్తుండగా, వాటిలో ఇప్పటికే పాడేరు, పులివెందుల కాలేజీల పనులు మొదలయ్యాయి.
 
ఈ నేపథ్యంలో ఆ రెండు మినహా మిగతా 14 మెడికల్‌ కాలేజీలు, నర్సింగ్‌ కళాశాలల నిర్మాణానికి సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఒకేసారి శంకుస్థాపన చేశారు. క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో ఆయన శిలాఫలకాలను ఆవిష్కరించారు.
 
ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ప్రసంగం:
 
ఏ పేద ఇబ్బంది పడకూడదు:
‘మనందరి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నిన్నటికి (ఆదివారం) రెండేళ్లు పూర్తైన సందర్భంగా ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి  శ్రీకారం చుడుతున్నాం. వైద్య రంగంలో ఏ పేదవాడికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు. ఏ పేద అయినా కూడా మంచి కార్పొరేట్‌ ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకునే రీతిలో.. మన దగ్గర టయర్‌–1 సిటీ.. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలు లేకపోయినా, అక్కడ ఉన్నటువంటి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు లేకపోవడంతో ఏ రకంగా ఇబ్బంది పడుతున్నామో మనమంతా గమనిస్తూనే ఉన్నాం’.
 
గొప్ప కార్యక్రమం:
‘ఆ పరిస్థితి మార్చేందుకు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక మెడికల్‌ కాలేజీ, నర్సింగ్‌ కళాశాల ఏర్పాటు. ప్రతి టీచింగ్‌ ఆస్పత్రికి ఒక మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి అక్కడే ఉంటుంది కాబట్టి, డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్‌ సిబ్బంది అందుబాటులోకి వస్తారు. వ్యవస్థలో ఒక పేదవాడికి ఒక మంచి వైద్యం, వీలైనంత వరకు పక్కనే అందుబాటులోకి తీసుకువచ్చే ఒక గొప్ప కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుడుతున్నాం’.
 
దశాబ్ధాలుగా 11 మాత్రమే:
‘బ్రిటిష్‌ కాలం నుంచి చూసినా, మన రాష్ట్రంలో కేవలం 11 మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉండగా, ఇవాళ కొత్తగా ఏకంగా 16 కొత్త మెడికల్‌ కాలేజీలు, నర్సింగ్‌ కాలేజీలు ఏర్పాటు చేయగలుగుతున్నాం. దేవుడు ఆ అవకాశం ఇచ్చాడు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న 16 మెడికల్‌ కాలేజీలలో ఇప్పటికే విశాఖ జిల్లా పాడేరు, కడప జిల్లా పులివెందుల మెడికల్‌ కాలేజీల పనులు మొదలయ్యాయి. మిగిలిన మరో 14 మెడికల కాలేజీల పనులు వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేస్తున్నాము’.
 
ఏం జరగబోతుంది?:
‘ఈ కాలేజీల నిర్మాణంతో భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రానికి కూడా తీసిపోని విధంగా మన రాష్ట్రం తయారవుతుందని సంతోషంగా చెబుతున్నాను. ఎందుకంటే మనకున్న లోపం. మనకు టయర్‌–1 నగరాలు లేవు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి మహానగరాలు లేవు. మల్టీ స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు అలాంటి నగరాల్లోనే ఉంటాయి. ఇటువంటి పరిస్థితి నుంచి మనకు విముక్తి కావాలంటే, మన దగ్గరే టెరిషరీ వైద్యం అభివృద్ధి చెందాలంటే మనం ఈరోజు వేసే గొప్ప అడుగు ఎంతగానో ఉపయోగపడుతుంది’.
 
‘ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రితో ఒక టీచింగ్‌ ఆస్పత్రి, దానికి అనుబంధంగా నర్సింగ్‌ కాలేజీ ప్రభుత్వ రంగంలోనే మనకు అందుబాటులోకి రావడం. ఇది ఒక అంశం కాగా, మరో అంశం’..
 
ప్రైవేటు రంగంలోనూ ఆస్పత్రులు:
‘మూడేళ్లలో పూర్తి చేసేలా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు, రూ.100 కోట్లు పెట్టుబడికి ఎవరు ముందుకు వచ్చినా కూడా జిల్లా కేంద్రాల్లోనూ, కార్పొరేషన్లలోనూ ఒక్కొక్కరికి 5 ఎకరాల చొప్పున భూమి ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. ఆ విధంగా ఒక్కో చోట ఒక 5 లేక 6 ఆస్పత్రులను ప్రభుత్వం ప్రోత్సహిస్తే దాదాపు మరో 80 నుంచి 90 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు ప్రైవేటు రంగంలో అందుబాటులోకి వస్తాయి’.
 
ఆరోగ్యశ్రీకి అనుసంధానం:
‘ఇవన్నీ కూడా ఆరోగ్యశ్రీకి అనుసంధానమై ఉంటాయి. ఏ విధంగా అయితే హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను అనుసంధానం చేశామో, అదే విధంగా మన రాష్ట్రంలో కూడా దాదాపు 80 నుంచి 90 ఆస్పత్రులు ఆరోగ్యశ్రీకి అనుసంధానంగా వస్తాయి’.
 
వైద్య రంగంలో మెరుగైన స్థితి:
‘ఇవన్నీ ఏర్పాటు కావడం వల్ల జిల్లాల రూపురేఖలు మారి, వైద్య రంగంలో ఒక మెరుగైన పరిస్థితి వస్తుందని, ఆ విధంగా పేదలకు మంచి వైద్యం అందుతుందని ఈ సందర్భంగా సగర్వంగా చెబుతున్నాను. ఇవాళ 14 మెడికల్‌ కాలేజీలకు శంకుస్థాపన చేస్తున్నాము. ఇప్పటికే పులివెందుల, పాడేరు మెడికల్‌ కాలేజీల పనులు మొదలయ్యాయి. ఈ 16 మెడికల్‌ కాలేజీలు, నర్సింగ్‌ కళాశాలల నిర్మాణానికి దాదాపు రూ.8 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నామని మీ బిడ్డగా సంతోషంగా చెబుతున్నాను’.
 
ప్రాణం విలువ తెలుసు కాబట్టే:
‘మనిషి ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వంగా, ప్రస్తుత జనాభా అవసరాలతో పాటు, రాబోయే అవసరాలను బేరీజు వేసుకుని ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో ఈ కాలేజీలను ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఆర్థిక, సామాజిక న్యాయం చేయడమే కాకుండా, పేదరికం కారణంగా సరైన వైద్యం అందుకోలేక అన్యాయానికి గురవుతున్న ప్రతి నిరుపేదకు మంచి వైద్య సదుపాయం వారి వాకిట్లోనే, వారి గడప వద్దకు తీసుకురావడంలో భాగంగా, ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. పాదయాత్రలో ఆనాడు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ, పేదలను ఆదుకునేందుకు ఈ నిర్ణయం’.
 
అప్పటికి అందుబాటులోకి:
‘విజయనగరం, అనకాపల్లి, అమలాపురం, రాజమండ్రి, పాలకొల్లు,  ఏలూరు, మచిలీపట్నం, బాపట్ల, పిడుగురాళ్ల, మార్కాపురం, మదనపల్లె, పెనుకొండ, నంద్యాల, అదోని కాలేజీలకు ఇవాళ శంకుస్థాపన చేస్తున్నాం. ఇప్పటికే పాడేరు, పులివెందుల కాలేజీల పనులు మొదలయ్యాయి. ఇవన్నీ కూడా 2023 డిసెంబరు నాటికి పూర్తైతే అందుబాటులోకి వస్తాయని గర్వంగా తెలియజేస్తున్నాను’.
 
ఆస్పత్రులు–వసతులు:
‘ప్రతి మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా ప్రత్యేక సేవలతో కూడిన 500 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి కూడా వస్తుంది. ఆ ఆస్పత్రుల్లో వైద్య పరంగా అత్యాధునిక టెక్నాలజీతో సేవలు అందుబాటులోకి తేవడం జరుగుతుంది. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 10 మోడ్యులర్‌ ఆపరేషన్‌ ధియేటర్లు. సెంట్రలైజ్డ్‌ ఏసీతో కూడిన ఐసీయూలు, ఓపీ రూమ్స్, డాక్టర్‌ రూమ్స్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ పైప్‌లైన్లతో అనుసంధానం చేసిన బెడ్లు, ఆక్సిజన్నిల్వ చేసిన ట్యాంక్‌లు, ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్లు కూడా వస్తాయి. ఇంకా ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌ వంటి సదుపాయాలు ప్రతి కాలేజీలో ఏర్పాటు చేయడం జరుగుతుంది’. ‘ప్రతి కాలేజీ కూడా జాతీయ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేసి, ఎన్‌ఏబీహెచ్‌ సర్టిఫికెట్‌ పొందే విధంగా అడుగులు. ప్రతి ఆస్పత్రిని ఆ స్థాయికి తీసుకుపోయేలా అడుగులు వేస్తున్నాము’.
 
ఆస్పత్రులు, నాడు–నేడు:
‘నాడు–నేడు కింద అన్ని ఆస్పత్రుల రూపురేఖలు సమూలంగా మారుస్తున్నాము. వీటన్నింటి కోసం దాదాపు రూ.16,300 కోట్లు ఖర్చు చేస్తున్నాము. ఇందులో భాగంగానే ప్రతి ఊరిలో 10,111 వైయస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు, 560 అర్బన్‌ హెల్త్‌ క్లినిక్‌లు, మండలానికి కనీసం రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ) ఉండేలా ఇప్పుడు ఉన్న 1,145 పీహెచ్‌సీలను అప్‌గ్రేడ్‌ చేయడంతో పాటు, కొత్తగా 176 పీహెచ్‌సీల నిర్మాణం. మొత్తంగా 1,321 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు. ఇంకా 52 ఏరియా ఆస్పత్రులు, 191 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు (సీహెచ్‌సీ) ఏర్పాటు చేస్తున్నాము. ఆ మేరకు అవసరమైన చోట్ల కొత్త వాటి నిర్మాణం చేపట్టడమే కాకుండా, మిగిలిన వాటిలో మౌలిక సదుపాయాలన్నీ ఉన్నత స్థాయిలో కల్పించడం జరుగుతుంది’.
 
జాతీయస్థాయి ప్రమాణాలు:
‘ఇవే కాక ఇప్పటికే ఉన్న 11 మెడికల్‌ కాలేజీల రూపురేఖలు నాడు–నేడు ద్వారా పూర్తిగా మారబోతున్నాయి. ఇవన్నీ కూడా ఎన్‌ఏబీహెచ్‌ ప్రమాణాలతో, ఆ గుర్తింపు పొందే విధంగా ఆ ఆస్పత్రులన్నీ అభివృద్ధి చెందేలా చర్యలు చేపడతాం. అదే విధంగా ఐపీహెచ్‌ఎస్‌ ప్రమాణాలకు అనుగుణంగా పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలను తీర్చి దిద్దుతాము. ఆ విధంగా అన్ని ఆస్పత్రులను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని సగర్వంగా తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా 2023 డిసెంబరు నాటికి పూర్తవుతాయి. అందుబాటులోకి వస్తాయి’.
 
వివిధ వర్గాలు–వైద్య సదుపాయాలు:
‘గిరిజన ప్రాంతాల అక్క చెల్లెమ్మలకు, గిరిజన సోదరులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడం కోసం రూ.246 కోట్ల వ్యయంతో సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, బుట్టాయగూడెం, దోర్నాలలో 5 గిరిజన మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులకు శ్రీకారం చుట్టాం’. ‘ఉద్ధానంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం పలాసలో రూ.50 కోట్లతో 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ కూడా ఏర్పాటు చేస్తున్నాం’.
 
‘రూ.272 కోట్లతో కడపలో మానసిక ఆరోగ్య కేంద్రం. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, క్యాన్సర్‌ ఆస్పత్రుల నిర్మాణానికి ఇప్పటికే శ్రీకారం చుట్టాం. ఇవన్నీ ఆస్పత్రులు కూడా 2023 డిసెంబరు నాటికి పూర్తవుతాయి. అందుబాటులోకి వస్తాయి’.
 
ఆరోగ్యశ్రీ–ఆరోగ్య ఆసరా:
‘దేశంలో కనీవినీ ఎరగని విధంగా వైద్య సేవల విస్తరణ. వైయస్సార్‌ ఆరోగ్యశ్రీలో గణనీయ మార్పులు. 2436 వైద్య చికిత్సలు. గతంలో కేవలం 1000 చికిత్సలకు మాత్రమే ఉండేవి. వైద్యం ఖర్చు రూ.1000 దాటితే వైయస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం వర్తింప చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి మంచి వైద్యం భారం కాకూడదన్న ఉద్దేశంతో రూ.5 లక్షల వార్షికాదాయం ఉన్న వారికి పథకం ఇవ్వడం ద్వారా 95 శాతం కుటుంబాలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చాయి’. ‘వైయస్సార్‌ ఆసరా. ఆపరేషన్‌ తర్వాత కూడా రోగులకు అండగా నిలబడుతూ నెలకు రూ.5 వేల ఆర్థిక సహాయం చేసే కొత్త కార్యక్రమానికి ఈ రెండేళ్లలో శ్రీకారం చుట్టామని ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తున్నాను’.
 
ఇతర చికిత్సలు:
‘దృష్టి లోపం ఉన్న వారికి ఉచితంగా కంటి పరీక్షలు, వైద్యం, శస్త్రచికిత్సలు  చేయించి కళ్ల అద్దాలు ఉచితంగా కంటి వెలుగు ద్వారా చేస్తున్నాం. కాక్లియర్‌ ఇంప్లాంట్‌ ఆపరేషన్‌తోపాటు, మూగ, చెవుడు పిల్లలకు బైకాక్లియర్‌ ఇంప్లాంట్‌ ఆపరేషన్‌ కూడా చేస్తున్నాము ఆరోగ్యశ్రీలో. అన్ని క్యాన్సర్‌ చికిత్సలు పథకంలోకి తీసుకువచ్చాం. 130 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులలో, ఈ పథకంలో హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో కూడా వైద్యం చేయిస్తున్నాం. దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారు మొదలు, మంచం, వీల్‌ చైర్లకు పరిమితమైన వారికి రూ.3 వేల నుంచి రూ.10 వేల పింఛన్‌ ఇస్తున్నాం’.
 
గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం:
‘ప్రతి గ్రామంలో వైయస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు. వాటిలో దాదాపు 91 రకాల ఔషథాలు. అక్కడే 24 గంటలు ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు అందుబాటులో ఉంటారు. ప్రతి మండలంలో కనీసం రెండు పీహెచ్‌సీలు. ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లు ఉంటారు. ఆ పీహెచ్‌సీలకు ఒక 104 వాహనం అనుసంధానం చేస్తున్నాం. ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లు. ఆ విధంగా ప్రతి డాక్టర్‌ మండలంలోని 7 నుంచి 8 గ్రామాలను ఓన్‌ చేసుకుని, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌లో వారానికి ఒకసారి ఏదైనా ఊరికి వెళ్లి వారికి అందుబాటులు ఉండి వైద్య సేవలు అందిస్తారు’.
 
కోవిడ్‌–ఆరోగ్యశ్రీ:
‘ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌ చికిత్సను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడంతో పాటు, కోవిడ్‌ తగ్గిన తర్వాత వస్తున్న బ్లాక్‌ ఫంగస్‌ వంటి వాటిని కూడా పథకంలో చేర్చడం జరిగింది’.
‘ఆరోగ్యశ్రీలో గత ప్రభుత్వం దాదాపు రూ.680 కోట్లు బకాయిలు పెడితే, అవి చెల్లించడంతో పాటు, ఇవాళ మూడు వారాల్లో నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు బిల్లులు ఇస్తున్నామని సగర్వంగా చెబుతున్నాను. ఆ విధంగా వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చాం’.
 
ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్‌ ట్రస్టు- రూ.5,215 కోట్లు:
‘ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా.. ఈ రెండేళ్లలో ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్టు ద్వారా రూ.5,215 కోట్లు ఖర్చు చేశాం. ఆరోగ్యశ్రీ చికిత్సల కోసం రూ.3,560 కోట్లు. ఆరోగ్య ఆసరా కోసం రూ.303 కోట్లు. ఉద్యోగుల ఆరోగ్య పథకంలో రూ.510 కోట్లు. 108, 104 సర్వీసుల కోసం రూ.452 కోట్లు. దీర్ఘకాల వ్యాధులు, పెన్షన్ల కింద మరో రూ.390 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని సగర్వంగా చెబుతున్నాను’.
 
పోస్టుల భర్తీ:
‘గతంలో ఏనాడూ లేని విధంగా మొత్తం 9,712 పోస్టులు డాక్టర్లు. నర్సులు, పారా మెడికల్‌ సిబ్బందిని నియమించాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పోస్టులు ఖాళీ ఉంటే వెంటనే భర్తీ చేశాం’.
‘ఇంకా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులన్నీ డబ్ల్యూహెచ్‌ఓ, జీఎంపీ ప్రమాణాలతో ఉంటున్నాయి. ఆ విధంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇవాళ దేశంలో ఎక్కడా జరగని విధంగా 108, 104 సర్వీసులు ఒకేసారి 1,180 వాహనాలు ప్రవేశపెట్టాము’.
 
వారికి రూ.5 లక్షల సాయం:
‘కోవిడ్‌ సమయంలో ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా ఉండి మరణించిన వారికి, కేంద్రం ప్రకటించిన పరిహారం వర్తించకపోతే, వారికి మన ప్రభుత్వం తరపున రూ.5 లక్షలు ఇస్తాము. కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌లో పని చేసే వారికి ఆ సహాయం చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే, ఆ కుటుంబానికి ఇవ్వాల్సిన సహాయంపై విధి విధానాలు ఖరారు చేయాలని సీఎస్‌కు ఆదేశిస్తున్నాం’.
 
మీ కుటుంబ సభ్యుడిగా:
‘దాదాపు 40కి పైగా సంక్షేమ పథకాలతో పాటు, వైద్య ఆరోగ్య రంగంలో మీ కుటుంబ సభ్యుడిగా నిండు మనసుతో దృష్టి పెట్టాను కాబట్టే, ఇవన్నీ చేయగలిగానని మీ కుటుంబ సభ్యుడిగా సగర్వంగా చెబుతున్నాను’. ‘కోవిడ్‌కు సంబంధించి మనందరి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అసెంబ్లీ సాక్షిగానూ, పలు సందర్భాలలో వివరంగా చెప్పడం జరిగింది. టీకాలు ఇవ్వడంలో కానీ, ఆక్సీజన్‌ విషయంలో కానీ, కోవిడ్‌ మందుల విషయంలో కానీ ప్రభుత్వం చేసే ప్రయత్నంలో ఎలాంటి లోటు లేదని, ఉండదని మరొక్కసారి మాట ఇస్తున్నాను’.

చివరగా..
‘మనందరి ప్రభుత్వం మీ అందరికీ మంచి చేసేలా దేవుడు ఆశీర్వదించాలని, ప్రజలందరి చల్లని దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాను’.. అంటూ సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ప్రసంగం ముగించారు.
 
14 చోట్ల శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొనగా, క్యాంప్‌ కార్యాలయంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), విద్యుత్‌,అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఎంపి పి.మిధున్‌రెడ్డి,  సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్, అదనపు డీజీపీ రవిశంకర్‌ అయ్యన్నార్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎంటీ కృష్ణబాబు, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, 104 కాల్‌ సెంటర్‌ ఇంఛార్జ్‌ ఎ.బాబు, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్‌ ఎ.మల్లికార్జున్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ వి.విజయరామరాజుతో పాటు, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెరుగుతున్న బ్లాక్ ఫంగస్.. హర్యానాలో 650కి పైగా కేసులు