తెలంగాణ చిన్నమ్మగా పేరుగాంచిన కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ మహిళా నేత సుష్మా స్వరాజ్ ఇకలేరు. ఆమె న్యూఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో చికిత్స పొందుతూ గత రాత్రి కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం లోధి రోడ్డులోని శ్మశానవాటికలో జరుగనున్నాయి. ఈ అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు.. కేంద్ర మంత్రులు, ఇతర పార్టీల నేతలు హాజరుకానున్నారు.
కాగా, ఎయిమ్స్‌లో మరణించిన సుష్మా స్వరాజ్ పార్థివ దేహాన్ని జంతర్ మంతర్‌లోని నివాసానికి తరలించగా, అప్పటి నుంచి పలువురు ప్రముఖులు మృతదేహాన్ని సందర్శించి, నివాళులు అర్పిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆమె అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. తొలుత ఆమె మృతదేహాన్ని బీజేపీ కేంద్ర కార్యాలయానికి తరలిస్తారు.
అక్కడ మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకూ కార్యకర్తలు, నేతల సందర్శనార్థం అక్కడ ఉంచనున్నారు. 3 గంటల తరువాత అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. జంతర్ మంతర్ నుంచి బీజేపీ కేంద్ర కార్యాలయం, లోధీ రోడ్‌కు వెళ్లే రహదారులను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.
కాగా, సుష్మా స్వరాజ్ తన మరణానికి కొన్ని గంటల ముందు ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ ఓ ట్వీట్ చేశారు. ఇదే ఆమె చేసిన ఆఖరి ట్వీట్ కావడం గమనార్హం. ఆర్టికల్ 370 రద్దు బిల్లుకు లోక్‌సభలో ఆమోద ముద్ర పడిన వెంటనే సుష్మ ట్విట్టర్ ద్వారా స్పందించారు.
రాత్రి ఏడున్నర సమయంలో ఆమె ట్వీట్ చేశారు. ఇది చూడడం కోసమే తాను జీవితకాలం ఎదురుచూశానని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ చేసిన కొన్ని గంటల్లోనే ఆమె గుండెపోటు కారణంగా తుది శ్వాస విడిచారు. దీంతో ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.