కరోనాతో లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇంటికే పరిమితం అవుతున్నారు. కొన్ని నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు కూడా లాక్ డౌన్‌తో ఇబ్బందులు తప్పట్లేదు. అలా ఓ చిన్నారి పసిపాప ఆకలితో పాలు లేకుండా ఇబ్బంది పడింది. అలా అర్థరాత్రి పూట పాలు కావాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ వెళ్లింది. ఆ చిన్నారి ఆకలి బాధను అర్థం చేసుకుని అర్ధరాత్రి బిడ్డ ఆకలి తీర్చి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు కేటీఆర్.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ డివిజన్ ప్రేమ్‌నగర్‌లో లకాన్‌సింగ్, జ్యోతి దంపతులు ఉండేవారు. వారికి ఓ 5 నెలల పాప కూడా ఉంది. వీరిద్దరూ కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. కానీ నెలరోజుల క్రితం పాప తల్లి జ్యోతి అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటి నుంచి తండ్రి లకాన్‌సింగ్ అన్నీ తారై పాపను చూసుకుంటున్నాడు. ప్యాకెట్ పాలు పట్టిస్తూ పోషిస్తున్నాడు. కొద్ది రోజుల నుంచి రాష్ట్రంలో లాక్ డౌన్ కారణంగా ఎక్కడి పనులు అక్కడే స్థంబించి పోయాయి.
కాగా ఆ చిన్నారి తండ్రికి ఎలాంటి కూలి పనులు దొరకక చేతిలో చిల్లి గవ్వలేని పరిస్థితి నెలకొంది. గురువారం చిన్నారికి పాల ప్యాకెట్ తీసుకేలేని పరిస్థితి. పాలు పట్టక పోవడంతో ఆ పసిపాప గుక్కపట్టుకు ఏడుస్తుంది. ఎంత బుజ్జగించినా ఏడుపు మానకపోవడంతో చుట్టు పక్కన వారు లేచి చిన్నారికి దగ్గరికి తీసుకున్నారు. అయినా ఫలితం లేకపోవడంతో వారి ఇంటి పక్కనే ఉంటున్న నవీన్ అనే యువకుడు మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశాడు.
ట్విటర్ ను చూసిన మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించి దగ్గర్లోని బోరబండ దగ్గర ఉంటున్న డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్‌కు సమాచారం ఇచ్చాడు. వెంటనే పాప ఆకలి తీర్చాలంటూ సూచించారు. కేటీఆర్ సూచనతో అర్థరాత్రి పూట ఒంటి గంటకు డిప్యూటీ మేయర్ బాబా చిన్నారి ఇంటికి చేరుకున్నారు. పాపకు పాలు, బిస్కెట్లతో పాటు ఆ కుటుంబానికి నెలకు సరిపడా సరుకులను కూడా అందించారు.
తమ కుటుంబానికి చేయూతనిచ్చిన కేటీఆర్‌కు, డిప్యూటీ మేయర్‌కు చిన్నారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. చెప్పగానే సూచనలు పాటించిన డిప్యూటీ మేయర్‌ను మంత్రి కేటీఆర్ అభినందించారు. ఇంకా అర్థరాత్రి పూట అలా చిన్నారి పాలు పంపిన కేటీఆర్‌ను, మేయర్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.