కేసీఆర్ పాలనకు 6 మార్కులు.. చంద్రబాబు పాలనకు 2.5 మార్కులు : పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన న్యూస్18 అనే ఆంగ్ల టీవీ చానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కారుపై మరోమారు ధ్వజమెత్త
జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన న్యూస్18 అనే ఆంగ్ల టీవీ చానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కారుపై మరోమారు ధ్వజమెత్తారు. పైగా, ఏపీ మంత్రి నారా లోకేశ్‌తో పాటు.. మరో 40 మంది టీడీపీ నేతలపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేశారు.
లోకేశ్‌తో పాటు పలువురు టీడీపీ నేతలు అవినీతికి పాల్పడుతున్నారనే విషయాన్ని చంద్రబాబుకు గత నాలుగేళ్లుగా చెబుతూ వస్తున్నా.. పట్టించుకోలేదు. తన ప్రభుత్వంలో అవినీతి జరుగుతున్నదని బాబుకు స్పష్టంగా తెలుసు. ఆయన స్పందించకపోవడంతోనే ఆ విషయాన్ని ప్రజలకు చెప్పాను. కేంద్ర ప్రభుత్వం ఈ ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా, పోలవరం ప్రాజెక్ట్‌ను ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్‌కు అప్పగించడం వెనుక కూడా దురుద్దేశం ఉందన్న అనుమానాలు ఉన్నాయన్నారు.
ఇకపోతే, నేనిప్పుడు లోకేష్‌పై ఆరోపణలు చేస్తుంటే నా వెనుక ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ ఉన్నారంటూ ప్రచారం చేస్తున్నారు. గతంలో బీజేపీ ఆరోపణలు చేసినపుడు అపుడు చంద్రబాబు నా వెనుక ఉన్నారని ప్రచారం చేశారని గుర్తుచేశారు. గతంలో జగనేమో నా వెనుక బాబు ఉన్నారన్నారు. కానీ ఇద్దరూ తప్పు. నేను కేవలం ప్రజలు చెప్పిందే వింటున్నాను అని పవన్ స్పష్టంచేశారు.
ఇకపోతే, ప్రత్యేక హోదాపై స్పందిస్తూ.. రాష్ట్రానికి హోదా వస్తుందా రాదా అన్నది అనవసరం. పేరు, హోదాతో పనిలేదు. ప్రస్తుతం రాష్ట్రానికి కేంద్రం ఆర్థిక సాయం కావాలి. మా డిమాండ్లను నెరవేర్చుకునేవరకు బీజేపీపై పోరాటం ఆగదు. ప్రస్తుతానికి జనసేన ఒంటరి పోరాటం చేస్తుందన్నారు. ఎన్నికల సమయంలో అవసరమైతే ఎవరితో కలిసి వెళ్లాలో నిర్ణయించుకుంటామని పవన్ అన్నారు.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఫెడరల్ ఫ్రంట్ తెరపైకి వచ్చిందని గుర్తుచేశారు. అయితే, మూడో ఫ్రంట్ దిశగా చర్చించినా.. పూర్తిస్థాయిలో చర్చించాల్సి ఉంది. బీజేపీ, కాంగ్రెస్ రెండూ ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యాయి. అందుకే ప్రస్తుతం దేశానికి మూడో ఫ్రంట్ అవసరమని పవన్ చెప్పారు. చివరగా కేసీఆర్, బాబు పాలనలకు పదికి ఎన్ని మార్కులు ఇస్తారని అడగ్గా.. కేసీఆర్‌కు 6, బాబుకు 2.5 మార్కులు ఇస్తానని పవన్ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.