తమిళనాడులో ఓటింగ్ శాతం మధ్యాహ్నానికి చాలా తక్కువ నమోదైంది. ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడులోనే తక్కువస్థాయిలో కేవలం 42.7 శాతం మాత్రమే మధ్యాహ్నం 3 గంటలకు నమోదైంది. దీనిప్రకారం చూస్తుంటే ఓటర్లు ఓటు వేసేందుకు ఆసక్తి చూపడం లేదని అర్థమవుతుంది. ఒకవైపు కరోనావైరస్ భయం వెంటాడుతోంది.
ఐనప్పటికీ పోలింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఓటు వేసేందుకు వెళ్లిన వారికి శానిటైజర్లు ఇవ్వడంతో పాటు మాస్కు లేకుండా వచ్చినవారికి మాస్కులు కూడా ఇస్తున్నారు. అలాగే ఓటు వేసే సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ బటన్ నొక్కేందుకు చేతులకు ప్లాస్టిక్ కవర్లను కూడా సరఫరా చేస్తున్నారు.
మరి ఓటింగ్ సరళి ఇలాగే కొనసాగితే ఏదో ఒక పార్టీకి భారీ పరాజయం తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. డిఎంకె గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుండగా అమ్మ జయలలిత పథకాలను అమలు చేయడమే కాకుండా ఆమె లేని లోటును సీఎం ఎడప్పాడి పళనిసామి కనిపించనివ్వకుండా బ్రహ్మాండంగా పరిపాలించారని అధికార పార్టీ అంటోంది. మరి విజయం ఎవరిదో మే 2 వరకూ వేచి చూడాల్సిందే.