Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముక్కులో పైపు... పక్కనే వైద్యులు.. బ్రిడ్జి పనుల తనిఖీలో గోవా సీఎం

Advertiesment
Manohar Parrikar
, సోమవారం, 17 డిశెంబరు 2018 (10:13 IST)
మనోహర్ పారీకర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నీతి నిజాయితీ కలిగిన సమకాలీన రాజకీయ నేత. చేసే పనుల పట్ల ఎంతో నిబద్ధత కలిగిన నేత. ఈ విషయం మరోమారు నిరూపితమైంది. శరీరాన్ని నిస్సత్తువ ఆవహించి, తీవ్ర అస్వస్థతకు లోనైనప్పటికీ, ముక్కులో పైపు, పక్కనే వైద్యులను పెట్టుకుని తన మానసపుత్రికగా భావించే మండోవి నదిపై చేపట్టిన వంతెన నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గోవా ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్ పారీకర్... అనారోగ్యంబారినపడ్డారు. ఫలితంగా తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. కొన్ని నెలలుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇపుడిపుడే ఆయన ఆరోగ్యం కుదుటపడుతోంది. ఈ నేపథ్యంలో మండోవి నదిపై చేపట్టిన వంతెన నిర్మాణ పనులను పర్యవేక్షించారు. వైద్యుల సాయంతో ఆయన ఈ వంతెన నిర్మాణ పనులను సమీక్షించేందుకు బయటకు వచ్చారు. 
 
ముక్కులో పైపుతో, పక్కనే వైద్యులతో వచ్చిన సీఎం నిర్మాణ పనులపై అధికారులతో మాట్లాడారు. నిర్మాణ పనులు చురుగ్గా సాగాలని, అనుకున్న సమయంలోనే నిర్మాణం పూర్తి కావాలని ఆదేశించారు. అలాగే, పంజిం సమీపంలో జువారి నదిపై నిర్మిస్తున్న మరో వంతెనను కూడా పారికర్ పరిశీలించారు. బ్రిడ్జి పనులను పర్యవేక్షించేందుకు పారికర్ 6 కిలోమీటర్లు ప్రయాణించారు. 
 
వచ్చే యేడాదికి పూర్తికానున్న ఈ బ్రిడ్జి పనాజిని ఉత్తర గోవాతో కలుపుతుంది. వైద్యులు, అధికారులు హెచ్చరిస్తున్నప్పటికీ పారికర్ మాత్రం బ్రిడ్జి నిర్మాణ పనుల సమీక్షకు వెళ్లాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో అధికారులు, వైద్యులు చేసేదేం లేక ఆయన ఆదేశాలనుసారం నడుచుకున్నారు. కాగా, ఈ ప్రాజెక్టును సీఎం తన మానసపుత్రికగా గతంలో చెప్పుకొచ్చారు. 
 
పారికర్ బ్రిడ్జి నిర్మాణ పనుల పర్యవేక్షణ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా స్పందించారు. ముక్కులో ట్యూబుతో, తీవ్ర అస్వస్థతతో ఉన్న వ్యక్తిని బయటకు ఎలా రానిచ్చారంటూ అధికారులపై మండిపడ్డారు. తమాషా చేస్తున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మా కూటమి ప్రధాని అభ్యర్థి రాహుల్ : ఎంకే స్టాలిన్ ప్రకటన