Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

#JusticeForDisha ఈ ఘటన తలదించుకునేలా చేసింది : రాజ్‌నాథ్

#JusticeForDisha ఈ ఘటన తలదించుకునేలా చేసింది : రాజ్‌నాథ్
, సోమవారం, 2 డిశెంబరు 2019 (17:49 IST)
పశువైద్యురాలు దిశ హత్యాచార ఘటన దేశంలోని ప్రతి ఒక్కరినీ బాధించిందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. లోక్‌సభలో దిశ ఘటనపై ఆయన మాట్లాడారు. ‘ఈ ఘటన దేశం మొత్తం తలదించుకునేలా చేసింది. ప్రతి ఒక్కరినీ బాధించింది. దోషులకు అత్యంత కఠినమైన శిక్ష విధించాలి. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలను నిలువరించేందుకు ఎటువంటి చట్టాలు తీసుకొచ్చేందుకైనా సిద్ధంగా ఉన్నాం. చట్టాల్లో మార్పులు చేసే విషయంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది’ అని ఆయన స్పష్టం చేశారు. 
 
ఈ దిశ ఘటనను పార్టీలకతీతంగా ఎంపీలంతా లోక్‌సభ సాక్షిగా ముక్తకంఠంతో ఖండించారు. ‘దిశ’ ఘటనను పార్టీలకతీతంగా ఖండించాలని లోక్‌సభలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ పిలుపునిచ్చారు. ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటామని, అన్ని పార్టీలు అంగీకరిస్తే చట్టం తీసుకొచ్చేందుకు కేంద్రం సిద్ధమని రాజ్‌నాథ్‌ ప్రకటించారు.
 
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా ఘటనపై స్పందించారు. దిశ ఘటనపై దిగ్భ్రాంతి చెందానని, పోలీసులు ఇలాంటి ఘటనల్లో చురుగ్గా పనిచేయాలని ఆయన సూచించారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఘటనలపై కేంద్రం సీరియస్‌గా ఉందని, కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్టం చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందని కిషన్‌రెడ్డి వెల్లడించారు. 
 
అలాగే, రాజ్యసభ కూడా ఖండించింది. దోషులను కఠినంగా శిక్షించాలని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌ డిమాండ్‌ చేశారు. కేసు విషయంలో జాప్యం లేకుండా త్వరగా నిర్ణయాలు రావాలన్నారు. ఇలాంటి ఘటనలు పునారవృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. 
 
దిశ హత్య దేశం మొత్తాన్ని కలచివేసిందని కాంగ్రెస్‌ నేత గులాంనబీ ఆజాద్‌ అన్నారు. చట్టాలు చేయడం ద్వారా మాత్రమే పరిష్కారం కాదని, సమస్య మూలాల నుంచి తొలగించడానికి సమాజం నిలబడాలని చెప్పారు. 
 
అన్నాడీఎంకే ఎంపీ విజిల్ సత్యానంద్ మాట్లాడుతూ, ‘దేశంలో చిన్నారులు, మహిళలకు రక్షణ లేకుండా పోయింది. దిశను హత్య చేసిన నలుగురు నిందితులను డిసెంబరు 31లోపు శిక్షించాలి. మరణించేంత వరకు వారిని ఉరితీయాలి. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసి సత్వరమే న్యాయం జరిగేలా చూడాలి’ అని డిమాండ్‌ చేశారు. 
 
ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు శిక్షలు వెంటనే అమలు చేయాలని ఎంపీ సుబ్బిరామిరెడ్డి అన్నారు. శిక్షలు వెంటనే అమలైతే ఇలాంటి ఘటనలు పునరావృతం కావని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై సభలోని అన్ని పార్టీల నేతలు విచారం వ్యక్తం చేశారు. 
 
కేవలం చట్టాలు చేస్తే సరిపోదు: వెంకయ్యనాయుడు 
కేవలం చట్టాలు చేస్తే బాధితులకు న్యాయం జరగదని రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు అన్నారు. చట్టాల్లో మార్పులు రావాల్సిన అవసరముందన్నారు. హైదరాబాద్‌లోనే కాదు.. దేశంలో ఎక్కడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని ఆయన చెప్పారు. మహిళలపై దాడులకు స్వస్తి పలకాల్సిన అవసరముందని తెలిపారు.
 
మరోవైపు దిశఘటనపై దిల్లీలోని జంతర్‌మంతర్‌లో ప్రజా, మహిళా, విద్యార్థి సంఘాలు ధర్నా చేపట్టాయి. నల్ల రిబ్బన్లతో వీరంతా ఆందోళన చేపట్టారు. నిందితులను బహిరంగంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. జస్టిస్‌ ఫర్‌ దిశ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫడ్నవీస్ తొందరే ముంచింది...... ఎక్కడ.. ఎందుకు?