ప్రపంచాన్ని వివిధ రకాల కొత్త వైరస్‌లు వణికిస్తున్నాయి. తాజాగా మరో కొత్త వైరస్ పురుడు పోసుకుంది. ఆఫ్రికా దేశాల్లో ఒకటైన ఘనాలో ఈ వైరస్ వెలుగు చూసింది. దీనికి మర్‌బర్గ్ అనే పేరు పెట్టారు. ఈ వైరస్ సోకిన ఇద్దరు వ్యక్తులు ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రజలతో పాటు వైద్య నిపుణులు ఉలిక్కిపాటుకు గురవుతున్నారు.
ఇది ఎబోలా తరహా లక్షణాలు కలిగిన వైరస్ కారణంగా ఈనెల మొదట్లోనే ఆ ఇద్దరు మృతిచెందారు. కాగా ఆసుపత్రిలో చనిపోయే ముందు వారు డయేరియా, జ్వరం, వికారం, వాంతులు లాంటి లక్షణాలతో బాధపడినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే మృతుల నమూనాలు సేకరించి సెనెగల్‌లోని ప్రయోగశాలలో పరీక్షలు నిర్వహించిన తర్వాత మర్‌బర్గ్‌గా తేలినట్లు ఘనా హెల్త్ సర్వీస్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ధ్రువీకరించింది. కాగా అప్రమత్తమైన ఘనా ప్రభుత్వం కట్టడి చర్యలు చేపట్టింది. అనుమానితులు, క్లోజ్ కాంటాక్ట్‌లను ఐసోలేషన్‌కు తరలించి వారిని పరీక్షిస్తోంది.
ఇదిలావుంటే, ఎబోలా కుటుంబానికి చెందిన మర్‌బర్గ్ వైరస్ ఓ అంటువ్యాధి. ఇది గబ్బిలాల ద్వారా వ్యాపిస్తుంది. ఆ తర్వాత మానవుల్లో వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ సోకిన వ్యక్తి శారీరక ద్రవాలు తాకినప్పుడు లేదా దగ్గర సంబంధాలు కలిగి ఉన్నప్పుడు ఒకరినుంచి మరొకరికి సోకే అవకాశాలుఉన్నాయి. ప్రాణాంతకమైన ఈ వైరస్ 2-21 రోజులపాటు ఓ వ్యక్తిలో సజీవంగా ఉంటుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.