పల్లెటూర్లలో ఇప్పటికీ పందేలు జరుగుతుంటాయి. మోయలేనంత బండలు పైకెత్తడం, ఒకేసారి వరసబెట్టి అరటిపళ్లు తినడం వంటివి ఎన్నో పందేలు వీటిలో వుంటుంటాయి. ఒక్కోసారి ఈ పందేలు ప్రాణాలను తీస్తుంటాయి. అలాంటిదే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఔనాపూరులో చోటుచేసుకుంది.
50 కోడిగుడ్లను ఏకబిగిన తింటే 2 వేల రూపాయల బహుమానం అంటూ గ్రామంలో పందెం వేశారు. దీనితో సుభాష్ యాదవ్ అనే 42 ఏళ్ల వ్యక్తి పందెంలో దిగాడు. 50 కోడిగుడ్లను ఏమాత్రం గ్యాప్ లేకుండా తినేస్తానని సవాల్ విసిరాడు.
ఇంకేముంది.. అతడి స్నేహితులు 50 కోడిగుడ్లను తెచ్చి ముందుపెట్టారు. వరుసగా ఒకదాని తర్వాత ఒకటి కోడిగుడ్లను చెకచెకా తినేస్తుండటంతో చూస్తున్నవారంతా ఆశ్చర్యంతో నిలబడిపోయారు. అయితే 42వ కోడిగుడ్డు తింటూ ఒక్కసారి కుప్పకూలి స్పృహ కోల్పోయాడు. వెంటనే అతడిని సమీప ఆసుపత్రికి తరలించారు.
పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే చనిపోయినట్లు తేల్చారు. దీనికి కారణం... అతడు మోతాదుకు మించి కోడిగుడ్లను తినడమేనని తేల్చారు. రోజుకి రెండు కోడిగుడ్లకు మించి తింటే గుండెపనితీరుపై ఒత్తిడి పెరుగుతుందని చెప్పారు. భారీగా కోడిగుడ్లు తినడంతో గుడ్డు పచ్చసొన గుండెపై ప్రతికూల ప్రభావం చూపిందనీ, దీనితో అతడు ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు నిర్థారించారు.