చైనా దేశంలో జననాల సంఖ్య విపరీతంగా పడిపోతోంది. నేషనల్ బ్యూరో ఆఫ్ చైనా డేటా ప్రకారం చైనాలో జననాల రేటు 2021 సంవత్సరంలో 7.52 మేరకు క్షీణించిపోయింది. పిల్లల్ని కనేందుకు ఎన్నో రివార్డులు ప్రకటిస్తున్నప్పటికీ చైనా జనాభా దాన్ని పెద్దగా పట్టించుకోవడంలేదు. జనాభా పెరిగిపోతుందని ఒక్కరే ముద్దు, ఇద్దరు వద్దు అంటూ ఏళ్లకు ఏళ్లపాటు కఠినంగా వ్యవహరించడంతో ఇప్పుడు చైనా జనాభా ఆ ఒక్కరు కూడా వద్దు అంటున్నారు.
చైనా జనాభా యువతలో సగటున 30 ఏళ్లు దాటనిదే పెళ్లి చేసుకోవడంలేదట. దీనితో 2011తో పోలిస్తే 2021లో 80 శాతం మేర వివాహ రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయి. చైనాలో జననాల రేటును పెంచేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం వుండటంలేదట. దీనితో మహిళలకు అబార్షన్లు, వాసెక్టమీ ఆపరేషన్లు చేయకుండా ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటోందట చైనా ప్రభుత్వం. ఇలా ఎన్ని చేసినప్పటికీ పిల్లల్ని కనేందుకు ఎంతమాత్రం ఉత్సాహం చూపించడంలేదట జనం.
కాగా ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో మొదటి స్థానం చైనాదే. ఆ దేశ జనాభా 144 కోట్లు. ఐతే వచ్చే నాలుగైదేళ్లలో ఈ సంఖ్యను మన దేశం దాటిపోనుంది. ప్రస్తుతం భారతదేశ జనాభా 140 కోట్లు. జననాల రేటు మన దేశంలో విపరీతంగా వుంటోంది. భారతదేశంలో సగటున నిమిషానికి 30 మంది జన్మిస్తుంటే చైనాలో ఆ సంఖ్య కేవలం 10 మాత్రమే.