ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థ అబుబాకర్ అల్ బాగ్దాదీని సిరియా డెమెక్రటిక్ దళాల సహకారంతో అమెరికా భద్రతా బలగాలు హతమార్చాయి. అయితే, బాగ్దాదీ ఆచూకీ కనిపెట్టేందుకు నిఘా నేత్రాలు సైతం విఫలమయ్యాయి. కానీ, ఓ జాగిలం మాత్రం ఖచ్చితంగా పసిగట్టి, అతన్ని వెంటాడి హతమార్చింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
ఆ ఉగ్రవాదిని వేటాడిన జాగిలం ఫోటోను డోనాల్డ్ ట్రంప్ రిలీజ్ చేశారు. ఓ చూడముచ్చటైన జాగిలం ఫోటోను రిలీజ్ చేశామని, అబూ బాకర్‌ను పట్టుకుని చంపడంలో ఈ జాగిలం కీలక పాత్ర పోషించినట్లు ట్రంప్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే ఆ జాగిలం పేరును మాత్రం వెల్లడించలేదు.
శనివారం జరిగిన ఆపరేషన్‌లో ఆ జాగిలం స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తోంది. సిరియాలోని ఓ టన్నెల్‌లో దాక్కున్న బగ్దాదీని అమెరికా భద్రతా బలగాలు వెంటాడి చంపేశాయి. బగ్దాదీని చంపిన విషయాన్ని మీడియాతో చెబుతున్న సమయంలో.. ట్రంప్ ఈ జాగిలాన్ని విశేషంగా కొనియాడారు.
టన్నెల్‌లో బగ్దాదీని ఆ శునకం వెంటాడినట్లు ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో ట్రంప్ తెలిపారు. ఆ తర్వాత ఓ ట్వీట్‌లో ఆ జాగిలం ఫోటోను పోస్టు చేశారు. అయితే, ఈ దాడిలో జాగిలం కూడా స్వల్పంగా గాయపడినట్టు అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు.