కరోనా వైరస్ దెబ్బకు దేశ సరిహద్దులు సైతం మూతపడుతున్నాయి. ఈ వైరస్ ధాటికి ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కలకలం చెలరేగింది. ఈ వైరస్ బారినపడినవారు తిరిగి కోలుకునే అవకాశం లేదని, అందువల్ల ముందు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. దీంతో ప్రజలు హడలిపోతున్నారు. ముఖ్యంగా చైనీయులు బెంబేలెత్తిపోతున్నారు.
ఈ నేపథ్యంలో కరోనా వైరస్ మహమ్మారి పొరుగుదేశాలను హడలెత్తిస్తోంది. తాజాగా, తమ దేశంలోకి ఈ ప్రమాదకర వైరస్‌ను రానివ్వకుండా చేసేందుకు రష్యా అన్నిరకాల చర్యలు తీసుకుంటోంది. చైనా సరిహద్దును మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. దీనిపై ఉన్నతస్థాయిలో ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయని రష్యా ప్రధానమంత్రి మిఖాయిల్ మిషుస్తిన్ తెలిపారు.
ఇప్పటికే భారత్ సహా అనేక దేశాలు చైనాకు విమాన సర్వీసులు నిలిపివేశాయి. చైనాలో ఉన్న తమ పౌరులను వెనక్కి రప్పించేందుకు అనేక దేశాలు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నాయి. చైనాలోని వుహాన్ నగరంలో మొదలైన ఈ వైరస్ ముప్పు క్రమంగా ఇతర ప్రాంతాలకు, ఇతర దేశాలకు వ్యాపిస్తోంది. ఇప్పటివరకు చైనాలో కరోనా వైరస్ కారణంగా 200 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇంకోవైపు, కరోనా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య చైనాలో అంతకంతకూ పెరుగుతోంది. గురువారం ఒక్క రోజే 38 మంది ప్రాణాలు వదిలారు. దీంతో మొత్తంగా ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 170కి పెరిగింది. మరోవైపు, ఇప్పటివరకు 7,700 మంది ఈ ప్రమాదకర వైరస్ బారిన పడగా, వీరిలో 1370 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.
అలాగే, ఈ వైరస్ ముప్పు మరింతగా పెరుగుతుండటంతో చైనాకు వెళ్లొద్దంటూ భారత్, అమెరికా, బ్రిటన్, జర్మనీ దేశాలు తమ పౌరులకు సూచించాయి. ఇక, వ్యాధి ప్రబలిన వూహాన్ నగరంలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక విమానాలను నడపాలని భావిస్తోంది. స్వదేశానికి వచ్చేందుకు అంగీకరించే అందరినీ స్వదేశానికి పంపిస్తున్నట్టు బీజింగ్‌లోని భారత ఎంబసీ తెలిపింది.