Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీమ రోడ్లపైకి మేడిన్ ఆంధ్రా కారు : టెస్ట్ డ్రైవ్ చేసిన చంద్రబాబు

Advertiesment
KIA car
, మంగళవారం, 29 జనవరి 2019 (16:26 IST)
కరవు సీమలోని జిల్లాల్లో ఒకటైన అనంతపురం జిల్లా రోడ్లపై కియా కారు రయ్ రయ్ మంటూ దూసుకెళ్లింది. దక్షిణ కొరియాకు చెందిన కార్ల దిగ్గజం కియ కార్ల తయారీ సంస్థ కియ.. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం, యర్రమంచి గ్రామంలో నెలకొల్పిన ప్లాంట్‌ నుంచి తొలికారును విడుదల చేసింది. ఈ కారు టెస్ట్ డ్రైవ్‌ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా నిర్వహించారు. 
 
సుమారు 650 ఎకరాల విస్తీర్ణంలో రూ.13 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో కియా సంస్థ ఏర్పాటైంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతోనే తాము రెండున్నరేళ్ల వ్యవధిలో ప్లాంటు, అసెంబ్లీ లైన్‌ను నిర్మించి తొలి కారును తయారు చేయగలిగామని సంస్థ చీఫ్ పార్క్ వ్యాఖ్యానించారు. మేడిన్ ఆంధ్రా కారుగా ఈ కారు నిలుస్తుందని తెలిపారు.
 
ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, కియా కార్ల తయారీ పరిశ్రమ ప్రధాని నరేంద్ర మోడీ వల్లే వచ్చిందంటూ బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలను కియా కోసం కేంద్ర ప్రభుత్వం తొలుత సిఫారసు చేసిందని... అయితే, అవినీతి రహిత రాష్ట్రమనే ఏపీకి కియా వచ్చిందని గుర్తుచేశారు.
 
తాను కాలికి బలపం కట్టుకుని పెట్టుబడుల కోసం తిరిగానని తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వైసీపీ, బీజేపీ కుతంత్రాలు పన్నుతున్నాయని చెప్పారు. అవినీతి రహిత రాష్ట్రాల్లో ఏపీ మూడో స్థానంలో ఉందని ఆయన గుర్తుచేశారు. కరవుసీమలో కియా కార్లు, కృష్ణా జలాలు పరుగులు పెట్టిస్తున్నట్టు చెప్పారు. కియా వల్ల రాష్ట్రానికి రూ.13,500 కోట్లు, అనుబంధ కార్ల పరిశ్రమతో మరో రూ.3 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. కియా ద్వారా 11 వేల మందికి, అనుబంధ పరిశ్రమల ద్వారా మరో 4 వేల మందికి ఉపాధి లభించనుంది. కియాలో ఏడాదికి 3 లక్షల కార్లు తయారవుతాయని తెలిపారు.
 
గతంలో ఫోక్స్ వాగన్ కార్ల పరిశ్రమను వైయస్, బొత్స సత్యనారాయణలు పోగొట్టారని విమర్శించారు. ముడుపుల కోసం అధికారులను జైలుపాలు చేశారని మండిపడ్డారు. కానీ, తాను మాత్రం కార్ల పరిశ్రమను తీసుకొచ్చి, తొలి కారును విడుదల చేస్తున్నానని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాఫెల్ స్కామ్ : మనోహర్ పారీకర్‌తో రాహుల్ భేటీ... మోడీకి వెన్నులో వణుకు!