బీజేపీకి అత్తెసరు మెజార్టీ... ఒక్క ఎంపీ హ్యాండిచ్చినా మైనార్టీ సర్కారే
కేంద్రంలోని భారతీయ జనతా పార్టీకి మున్ముందు కష్టాలు తప్పేలా లేవు. ఆ పార్టీకి చెందిన భాగస్వామ్య పక్షాలు ఒక్కొక్కటిగా హ్యాండిస్తూ వస్తున్నాయి. దీంతో గతంలో తిరుగులేని కూటమి లేదా ప్రభుత్వంగా ఉన్న బీజేపీ ఇప
కేంద్రంలోని భారతీయ జనతా పార్టీకి మున్ముందు కష్టాలు తప్పేలా లేవు. ఆ పార్టీకి చెందిన భాగస్వామ్య పక్షాలు ఒక్కొక్కటిగా హ్యాండిస్తూ వస్తున్నాయి. దీంతో గతంలో తిరుగులేని కూటమి లేదా ప్రభుత్వంగా ఉన్న బీజేపీ ఇపుడు అత్తెసరు మార్కులతో కాలాన్ని వెళ్లదీయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నిజానికి 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 300 పైచిలుకు సీట్లు రాగా, ఒక్క బీజేపీకే 282 సీట్లు వచ్చాయి. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగినంత మెజారిటీని దక్కించుకుంది. అయితే, తర్వాత కాలంలో బీజేపీ బలం అంతకంతకూ తగ్గుతూ వస్తోంది. సభ్యులు మరణించినపుడు జరిగే ఉప ఎన్నికల్లో తిరిగి బీజేపీ అభ్యర్థులు గెలవకపోవడం ఇందుకు ప్రధాన కారణం.
తాజాగా ఉత్తరప్రదేశ్‌లో జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో రెండు సీట్లు కోల్పోవడంతో బీజేపీ బలం 272కు పడిపోయింది. ఇది సరిగ్గా అత్తెసరు మార్కులతో కూడిన మెజార్టీలో ఉంది. ఇందులో ఏ ఒక్క ఎంపీ హ్యాండిచ్చినా సాంకేతికంగా ప్రధాని మోడీ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయినట్టే. నాలుగేళ్ల క్రితం బీజేపీకి 282 సీట్లు వుండగా ఇపుడు ఆ సంఖ్య 272కు పడిపోయింది. మొత్తం మీద ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు ఇపుడు బొటాబొటి మెజార్టీతో అధికారంలో కొనసాగుతోంది.
మరోవైపు కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం ఉరకలేస్తోంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 44 సీట్లతో అత్యంత అవమానకరమైన ఓటమిని చవిచూసిన కాంగ్రెస్ పార్టీ ఈ నాలుగేళ్లలో నాలుగు సీట్లు పెంచుకుంది. బీజేపీకి 10 సీట్లు తగ్గాయి. దేశవ్యాప్తంగా 7 సీట్లకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. వాటి ఫలితాలు మరికొన్ని పార్టీల భవితను నిర్దేశించనున్నాయి.