నారా లోకేష్ ఓడిపోతాడని భారీ బెట్టింగులు... రాసిపెట్టుకోండంటున్న థర్టీ ఇయర్స్ పృధ్వీ

బుధవారం, 17 ఏప్రియల్ 2019 (18:51 IST)
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి. లోక్ సభ ఎన్నికల ఫలితాల మాట ఎలా వున్నా ఏపీ అసెంబ్లీ ఫలితాల గురించి విపరీతంగా చర్చ జరుగుతోంది. కొందరు నాయకులైతే తమకు ఓటింగ్ ఎలా వున్నదని సర్వేలు చేసుకుంటున్నారు. ఆ సర్వేల్లో వచ్చిన ఫలితాలను చూసి షాక్ తినేవారు కొందరైతే... ఉబ్బితబ్బిబ్బవుతున్నవారు మరికొందరు. అసలు లెక్క తేలేందుకు మరో 41 రోజుల వ్యవధి వున్నది. ఇక అసలు విషయానికి వస్తే వైసీపీ నాయకుడు, నటుడు థర్టీ ఇయర్స్ పృధ్వీ మాటల తూటాలు పేల్చుతున్నారు.
 
వచ్చే ఎన్నికల్లో తెదేపా ప్రభుత్వంలోని 18 మంది మంత్రులు ఘోర పరాజయం చవిచూడబోతున్నారని జోస్యం చెప్పారు. అంతేకాదు... నారా లోకేష్ కనీసం 8 వేల ఓట్ల పైచిలుకు తేడాతో పరాజయం చవిచూడబోతున్నారంటూ చెప్పారు. మా పార్టీకి చెందిన రియల్ హీరో ఆర్కేకె ప్రజలు భారీగా ఓట్లు వేశారని చెప్పుకొచ్చారు. మంగళగిరిలోని ప్రజల వద్దకెళ్లి అసలు సంగతి తెలుసుకున్నానంటూ చెప్పుకొచ్చారు. అక్కడి ప్రజలు చంద్రబాబు పాలన మాట ఎలా వున్నా తాము మాత్రం జగన్ మోహన్ రెడ్డికి ఓటు వేశామని చెప్పారని వెల్లడించారు.
 
ఈ విషయం తెలిసే తెదేపా నాయకుల ముఖాలు నల్లగా మాడిపోయి, వాడిపోయి కనిపిస్తున్నాయని సెటైర్లు వేస్తున్నారు. ఇక చేసింది చాలు... వారంతా వెళ్లి హాయిగా ప్రకృతి వైద్యశాలల్లో సేద తీరవచ్చంటూ సలహా ఇస్తున్నారు. మరోవైపు మంగళగిరిలో నారా లోకేష్ ఓడిపోతారంటూ భారీ బెట్టింగులు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవం ఎంతన్నది తేలాల్సి వుంది. మరి అసలు రిజల్ట్ ఏమిటన్నది తేలాలంటే మే 23 వరకూ ఆగాల్సిందే.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం #KGF హీరోకి వార్నింగ్.. మాలాంటి వారు లేకపోతే మీ జీవితాలు..?