జగన్ పేషీలో ఒకే సామాజికవర్గానికి పెద్దపీట... షాకిచ్చిన అమిత్ షా!

శుక్రవారం, 18 అక్టోబరు 2019 (10:03 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టి ఐదు నెలలు గడుస్తున్నాయి. ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకముందే పాలనాపరంగా ఆనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇలాంటి వాటిలో రాష్ట్ర డీజీపీగా గౌతం సవాంగ్‌ను తాత్కాలికంగా నియమించి, ఆ తర్వాత ఆయన్నే పూర్తిస్థాయి డీజీపీగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. 
 
అలాగే, మరో కీలకమైన నిఘా విభాగం అధిపతి (ఇంటెలిజెన్స్ చీప్). ఈ పోస్టులో తెలంగాణ రాష్ట్ర క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రను డిప్యూటేషన్ మీద ఏపీకి తీసుకుని, ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతలు కట్టబెట్టాలని జగన్ భావించారు. దానికోసం ఆయన స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను స్వయంగా కోరడం.. ఆయన అంగీకరించడం చకచకా జరిగిపోయాయి. ఈ తంతు పూర్తై నాలుగు నెలల గడిచిపోయింది. అయితే ఇప్పటి వరకు ఏపీ ఐబీ చీఫ్‌గా స్టీఫెన్ రవీంద్ర నియామకపు ఉత్తర్వులు వెలువడలేదు.
 
దీనికి అనేక కారణాలు లేకపోలేదు. కేంద్ర హోంశాఖ మోకాలడ్డడమే కారణమని తేలింది. తెలంగాణ క్యాడర్‌లో ఉన్న ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రను ఆంధ్రప్రదేశ్ క్యాడర్ బదిలీ చేయడమో లేక డిప్యూటేషన్‌పై పంపడమో చేయాలని రెండు తెలుగు రాష్ట్రాల కేంద్ర హోం శాఖను కోరాయి. జూన్ రెండో వారంలోనే రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కేద్రానికి లేఖ రాశాయి. కానీ.. వీరి అభ్యర్థనను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా లోతుగా పరిశీలించేందుకు తన దగ్గరే అట్టి పెట్టేసుకున్నారని సమాచారం.
 
సుమారు రెండు నెలల తర్వాత ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రను తెలంగాణ నుంచి ఏపీకి ఇవ్వడం కుదరదని కేంద్ర హోం శాఖ ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు తేల్చి చెప్పింది. కారణాలపై ఆరా తీస్తే ఆసక్తికరమైన అంశాలు తెరమీదికొచ్చాయి. 
 
ఏపీ ముఖ్యమంత్రి జగన్ సీఎంవోలోను, ఆయన సొంత టీమ్‌లోను ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు అధిక సంఖ్యలో పోలరైజ్ అవుతున్నట్లు కేంద్ర ఇంటెలిజెన్స్ ‌అధికారులు నివేదిక ఇవ్వడంతో అమిత్ షా కాస్త లోతుగా పరిశీలించాలని భావించినట్లు సమాచారం. 
 
పూర్తి వివరాలు పరిశీలించిన తర్వాత స్టీఫెన్ రవీంద్ర కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో తెలుగు ప్రభుత్వాల అభ్యర్థనను తోసిపుచ్చాలని అమిత్ షా భావించినట్లు తెలుస్తోంది. సో.. కేంద్ర హోం శాఖ తిరస్కారంతో ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర ఇక తెలంగాణకే మిగిలిపోనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం హుజూర్​నగర్​లో కేసీఆర్ బహిరంగసభ రద్దు