Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మూడుపై మంటలు : రాజధాని గ్రామాల్లో బంద్.. వైఎస్ ఫోటోలతో ర్యాలీలు

Advertiesment
Amravati bandh
, గురువారం, 19 డిశెంబరు 2019 (13:35 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు రావొచ్చన్న ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రకటనతో రాష్ట్రం అగ్నిగుండంలా మారింది. ముఖ్యంగా, రాజధాని కోసం స్వచ్ఛంధంగా భూములు ఇచ్చిన 29 గ్రామాల ప్రజలు, రైతులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా గురువారం బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పోలీసులు 144, 34 సెక్షన్ విధించారు. ఈ మేరకు తుళ్లూరు డీఎస్పీ తెలిపారు. 
 
రైతులు తమ ఆందోళనను శాంతియుతంగా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిర్వహించాలని కోరారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. ఏపీ రాజధాని మూడు ప్రాంతాల్లో ఉంటుందన్న ప్రభుత్వ ప్రకటన నేపథ్యంలో రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో రైతులు బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్, 34 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. 
 
బంద్ నేపథ్యంలో పాఠశాలలు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, హోటళ్లు మూతపడనున్నాయి. తమ ఆందోళనల్లో భాగంగా రైతులు, కూలీలు వెలగపూడిలో రిలే నిరాహారదీక్షలను ప్రారంభించనున్నారు. అలాగే, 29 గ్రామాల్లోని ఆయా గ్రామ సచివాలయాల వద్ద కూడా రిలే నిరాహార దీక్షలు ప్రారంభించనున్నారు. పలు గ్రామాల్లో శాంతి ర్యాలీలు జరుగగా, ఇందులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటోలు చేతబట్టుకుని పలువురు రైతులు ర్యాలీలో పాల్గొనడం విశేషం. 
 
అదేవిధంగా, రాజధాని కోసం భూములు ఇచ్చిన మందడం, వెంకటపాలెం, తుళ్లూరు, రాయపూడి తదితర గ్రామాల్లోని రైతులు పురుగుమందు డబ్బాలు చేతపట్టుకొని నిరసనల్లో పాల్గొన్నారు. రాజధాని గ్రామాల పరిధిలోని పలుచోట్ల రైతులు దీక్షకు దిగారు. వెలగపూడి, రాయపూడి, కృష్టాయపాలెం, మందడం రైతులు ధర్నా చేశారు. మందడంలో రోడ్డుపై రైతులు, రాజధాని రైతు కూలీ సంఘ నేతలు బైఠాయించారు. దీంతో ముందు జాగ్రత్తగా చర్యగా పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. 
 
వెంకటపాలెంలో రాజధాని రైతులు నిరాహారదీక్షకు దిగారు. వెలగపూడి ప్రధాన కూడలిలో ఆందోళన చేపట్టారు. ‘ముఖ్యమంత్రులు మారితే రాజధానిని మారుస్తారా? ఎన్నికల ముందు రాజధాని మార్పు, మూడు రాజధానుల సంగతి ఎందుకు చెప్పలేదు’ అని జగన్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అమరావతికి భూములు ఇచ్చిన మా పరిస్థితి ఏంటని నిలదీశారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.
 
ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ, అమరావతి నిర్మాణార్థం తమ భూములు దాదాపు 33,000 ఎకరాలకుపైగా పూలింగ్‌ కింద ఇచ్చిన తమ త్యాగం వృథా కారాదని నినదించారు. వీరి ఆందోళనలతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సచివాలయం ఉద్యోగులు దాదాపు రెండు కిలోమీటర్ల అవతల నుంచి నడిచి కార్యాలయానికి చేరుకోవాల్సి వచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అంగట్లో ఆటగాళ్లు.. ఐపీఎల్ వేలం : దృష్టి అంతా ఈ ఆటగాళ్ల మీదే