ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇల్లు కట్టడం సాధ్యం కాదు అన్నది అందరికీ తెలిసిందే. ఇసుక, సిమెంట్, కంకర రాళ్ళు, కూలీ ఇలా అన్నీ ఎక్కువ రేట్లే. ఇలాంటి పరిస్థితుల్లో సొంత ఇల్లు కట్టుకోవడం అస్సలు సాధ్యం కాదన్నది అందరికీ తెలిసిందే. అయితే అతి తక్కువ ఖర్చుతో ఇళ్లను నిర్మించారు రాజమండ్రికి చెందిన వారు.
రాష్ట్రంలో తొలిసారి ప్రయోగాత్మకంగా మోడల్ హౌస్‌కు రాజమండ్రి ఎంపి మార్గాని భరత్ రామ్ రూపకల్పన చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ జేగురుపాడులో 320 గజాల్లో అతి తక్కువ ఖర్చుతో టెక్నాలజీతో నిర్మించిన మోడల్ హౌస్‌ను సోమవారం ప్రారంభించారు.
సోలార్ రూఫ్ టెక్నాలజీ, వర్టికల్ గార్డెనింగ్‌తో రూపొందించిన మోడల్ హౌస్‌ను 48 గంటల్లో పూర్తి చేశారు. రాష్ట్ర హౌసింగ్ చరిత్రలో మొదటిసారి ఒక మోడల్ హౌస్ నిర్మాణం జరిగిందని ఎంపి తెలిపారు. ఇది విజయవంతం కావడంతో భవిష్యత్తులో నిరుపేదలకు ఇలాంటి ఇళ్లే నిర్మించి ఇస్తామన్నారు. ఈ ఇంటి నిర్మాణానికి కేవలం మూడున్నర లక్షల రూపాయలు మాత్రమే ఖర్చయ్యిందన్నారు.