వర్మ 26/11 సక్సెస్... మరి మిస్టర్ పెళ్లికొడుకు... జబర్ దస్త్ మాటేంటి.. తెర వెనుక ఏంటి?
, బుధవారం, 6 మార్చి 2013 (17:51 IST)
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సక్సెస్ రేటు తగ్గిపోతుందనే ఆందోళన చెందుతున్న వారిలో ఇటీవలే విడుదలైన మూడు చిత్రాల పరిస్థితిని గమనిస్తే.... ఎందుకు ఇలా జరుగుతుందో అర్థమవుతుంది. ఎక్కడ లోపం జరుగుతుందో తెలుసుకోవాలంటే... తెర ముందే కాదు... తెరవెనుక ఏం జరుగుతుందో చూద్దాం.సినిమాలు తీయడం కతలు రాసుకోవడం వేరు. జరుగుతున్న సంఘటనలు తీయడం వేరు. తీసినా మెప్పించడం వేరు. ఆల్‌రెడీ విడుదలైన సినిమాలను కాపీ చేయడం కూడా అదే పరిస్థితి. ఇటీవలే మూడు సినిమాలు విడుదలయ్యాయి. 'అలా మొదలైంది' దర్శకురాలు నందినీ రెడ్డి ద్వితీయ ప్రయత్నంగా 'జబర్‌దస్త్' తీసింది. కొద్దిరోజుల గ్యాప్‌తో వచ్చిన 'మిస్టర్ పెళ్ళికొడుకు'కు దేవీప్రసాద్ దర్శకత్వం వహించారు. వీటికి భిన్నంగా బాంబుబ్లాస్ట్‌లు, టెర్రరిజం నేపథ్యంలో తాజ్‌హోటల్ నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రం '26/11, ఇండియాపై దాడి'.ఈ మూడింటిలో పాయింట్ కామన్ ఏమంటే... రెండు సినిమాలు ఆల్‌రెడీ హిందీలో చేసేశారు. దాన్ని కాపీ చేయడమే. మూడో సినిమా మాత్రం జరిగిన సంఘటనలో అక్కడి పరిస్థితి ఏమిటి? దాడి తర్వాత అధికారుల ఆలోచనలు ఎలా ఉన్నాయనేది వర్మ తెరకెక్కించారు. ఇందులో వర్మ చిత్రానికి విమర్శకులు సైతం మార్కులు వేసేశారు. కానీ మిగిలిన రెండు చిత్రాలను చూసి తీయడం కూడా సరిగ్గా రాదనే తిరస్కారాన్ని ఆపాదించారు. అసలెందుకిలా జరుగుతుంది? కథ రాసుకున్నప్పుడు ఫలానా పాత్రకు ఇతనైతే బాగుంటుందని, మిగిలిన పాత్రలు ఇలా ఉండాలని దర్శకుడు నేర్పుతో ఆధారపడి ఉంటుంది. '26/11లో' అదే జరిగింది. అందులో కీలకమైన వ్యక్తి ఉగ్రవాది కసబ్ పాత్ర. అతన్ని ఎంపిక చేయడంలో దాదాపు 1500 మందిని స్క్రూట్‌నీ చేసి ఫైనల్‌గా అలాంటి పోలికలున్న సంజీవ్ జైస్వాల్‌ను ఎన్నుకోవడంలో దర్శకుడు సగం సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత మరో కీలక పాత్రధారి జాయింట్ పోలీస్ కమీషనర్.. ఈ పాత్రను నానాపటేకర్‌ను తీసుకోవడం. ఈ రెండు పాత్రలే సినిమాకు ప్రాణం. అసలు ఈ చిత్రాన్ని తీయడానికి కారణం కూడా... అప్పటి దాడిలో పోలీస్ కమీషనర్‌తో గడిపిన క్షణాలు, ప్రజల భయం, అక్కడ అభద్రతా భావం పురిగొల్పాయని వర్మ వెల్లడించారు. అయితే పోలీస్ ఆఫీసర్ వ్యూలో తీశాడని చెప్పాడు. కరెక్టే.. కానీ కసబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీయడం చాలా కష్టం. అతని మనసులో దూరి ఏముందో చెబుతాడనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఈ సినిమా తీస్తానని చెప్పినప్పుడు మేధావులంతా వర్మపై విమర్శలు గుప్పించారు. ఈయనకు పిచ్చెకిందనే కామెంట్లు చేశారు. మరోవైపు... సంఘటనను క్యాష్ చేసుకుంటున్నాడని అన్నారు. అలా చేయడం సాహసమే... ఒకవేళ తీసినా సినిమా ఆడుతుందో లేదో తెలియదు. ఇలాంటి విమర్శలు చాలానే ఉన్నాయి. రంగీలా అంటూ.. ఎక్స్‌పోజింగ్ చేయిస్తూ.... దెయ్యం, భూతం అంటూ.. సినిమాలు తీస్తూ... నా ఇష్టం వచ్చినట్లు తీస్తాను.. చూస్తే చూడండని... కేర్‌లెస్‌గా సమాధానలు చెప్పిన... వర్మకూడా ... 26/11 సినిమాతో 'నేను మారాను' అని స్టేట్‌మెంట్ కూడా ఇవ్వాల్సి వచ్చింది. ఆ మారింది ఎలా అంటే సినిమా చూడమన్నాడు. చూశాక... అందులో పాత్రల్లోకి ప్రేక్షకుల్ని ఇన్‌వాల్వ్ చేశాడు. తాజ్‌హోటల్‌లో అందరూ ఉన్న భావన కల్గించి ఒళ్ళు జలదరించేలా చేశాడు. ఈ సినిమాను చూశాక మల్టీప్లెక్స్ థియేటర్లలో ఆడియన్స్ లేచి క్లాప్స్ కొట్టడం... బహుశా ఈమధ్యలో ఏ సినిమాకూ జరగలేదు. కొందరైతే వర్మ మొదట్లో తన సత్తాను చాటినట్లు.. జూలు విధిలించాడని ప్రశంసించారు.ఇంతకీ ఆయన చేసింది ఏమిటంటే... జరిగింది ముంబైలో కానీ.. ఎక్కడా ముంబై పేరు ప్రస్తావించకుండా... భారత్‌పై దాడి అనేది హైలైట్ చేశాడు. దీనిపరంగా విమర్శకులను సైతం మెప్పించాడు. అసలు ఎప్పుడో మర్చిపోయిన గాయాన్ని మళ్ళీ పుండుమీద కారంలా జల్లడం అవసరమా? అన్న వారిని సైతం... హైదరాబాద్‌లో బాంబు దాడులు జరగడంతో... ఈ చిత్రానికి మరింత కలిసి వచ్చింది. ఈ సినిమాకు నానాపటేకర్, కసబ్ పాత్రలతోపాటు రీరికార్డింగ్ హైలైట్‌గా నిలిచాయి. అందుకే మంచి ఓపెనింగ్స్‌తో స్టార్టయి ఇంకా రన్నింగ్‌లో ఉంది.
మిస్‌కాస్టింగ్‌తో ఫెయిలయ్యారు!ఇదిలా ఉండగా, సునీల్, ఇషాచావ్లాతో దేవీప్రసాద్ తీసిన 'మిస్టర్ పెళ్లికొడుకు' సినిమా దర్శకుడు తప్పిదమే అంటున్నారు. హిందీలో 'తను వెడ్స్ మను' చిత్రానికి ఇది రీమేక్. అసలు రీమేక్ చేయాలనుకున్నప్పుడే సాహసం చేస్తున్నారనే కామెంట్లు విన్పించాయి. హిందీలో మాధవన్, కంగనా రనౌత్ పాత్రధారులు. మాధవన్ హిందీలో పెద్ద ఇమేజ్ లేదు. చాలా అమాయకపు పాత్ర.కానీ కంగనా రనౌత్‌ది పూర్తి విరుద్ధం. గతంలో మధుర్ భండార్కర్ తీసిన చిత్రాల్లో ఆమె ఒక ఇమేజ్ ఉంది. ఫారిన్ రిటర్న్ పాత్ర పోషించింది. అందులో సిగరెట్లు తాగడం ఏరగెంట్‌గా ఉండడం అనేవి.. ఆ పాత్రలో ఆమె జీవించేసింది. అయితే తెలుగులోకి వచ్చేసరికి పాత్రల్ని రివర్స్ చేసేశారు. అందులోనూ.. సునీల్ అనేసరికి కామెడీ జానర్ మనిషి. అతన్ని అమాయకపు పాత్రగా తీర్చిదిద్దడంలో దర్శకుడు ఫెయిలయ్యాడు. అది 'మర్యాదరామన్న'లో రాజమౌళికి మాత్రమే సరిపడింది. దానికితోడు డాన్స్‌లు, సిక్స్‌ప్యాక్ అంటూ చూపించి కాస్త బోర్‌కొట్టించాడు. ఇక హీరోయిన్ ఇషాచావ్లా పాత్ర చెప్పక్కర్లేదు. ఆమెలో అసలు నటనే లేదని ప్రేక్షకులు చెప్పేశారు. గతంలో లీలామహల్ సెంటర్, ఆడుతూపాడుతూ.. వంటి చిత్రాలు తీసిన దేవీప్రసాద్ ఈసారి తప్పులో కాలేశాడు.
కథను నొక్కేసి...సినిమా ఇండస్ట్రీలో దర్శకులకు రెండో ప్రయత్నం కష్టంగా ఉంటుంది. అలామొదలైంది తర్వాత నందినీరెడ్డి చేసిన 'జబర్‌దస్త్' ఎలా ఉంటుందోనని చాలామందిలో మొదలైంది. కానీ సినిమా విడుదలయ్యేదాకా ఆమె చేసిన తప్పిదం ఏమిటో అర్థంకాలేదు. తన స్వంత కథగా పేరు వేసుకున్న ఆమె... అసలు హిందీ చిత్రమైన 'బ్యాండ్ బాజే భారత్' అనే సినిమాను కాపీ చేసేసిందన్న ప్రచారం జరిగింది. దీనిపై పెద్ద చర్చ జరుగుతోంది. అసలు ఈ చిత్రాన్ని హిందీలో తీసిన ఆదిత్యచోప్రా తెలుగులో నాని హీరోగా చేయాలని ఫొటో ష్యూట్ కూడా ఏర్పాటు చేశాడు. ముంబై వెళ్ళి అక్కడ తనను ఫొటో షూట్ చేయడం పట్ల అదృష్టం తనను వెతుక్కుంటూ వచ్చిందని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు నాని. కానీ ఆ తర్వాత జరిగిన సంఘటనే.. నందినీ రెడ్డి బజర్‌దస్త్... ఈ చిత్రంలోనూ మైనస్ పాయింట్. హీరోగా సిద్దార్థ్‌ను ఎంపికచేయడం. కొన్నిచోట్ల హీరోయిన్ సమంత డామినేట్ చేస్తుంది. లవర్ బాయ్ పాత్రలు వేసే సిద్దార్థ్‌లో కాస్త అమాయకత్వంతో పాటు పూర్తి మెచ్యూరిటీ కలిగిన మాస్ పాత్ర ప్రేక్షకులకు ఎక్కలేదు. దీంతో అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది. పైగా సిద్దార్థ్ .. చిత్రంలోని మిగిలిన పాత్రల ఎంపికలోనూ వేలు పెట్టడం వ్యవహారం మరింత బెడిసికొట్టిందని అన్నారు. సినిమాలో ఆయనతో పాటు వుండే పాత్రను తెలుగులో ఎవ్వరూ పనికిరానని.. తన ఫ్రెండ్ చెన్నైలో ఉన్నాడని అతడికి ఫ్లైయిట్ చార్జీలు కూడా ఇప్పించి తెచ్చుకున్న ఘనత సిద్దార్థ్‌దని టాలీవుడ్ ఇండస్ట్రీ చెపుతోంది. ఇలాంటి విషయాల్లో నిర్మాత దర్శకులకూ ఫ్రీడమ్ కూడా లేకపోవడంతో తను ఆడింది ఆట పాడింది పాటగా మారింది.జనరల్‌గా ఇటువంటి విషయంలో నటీనటులు చాలా కేర్‌గా ఉండాలి. ఎవరిపనివారు చేసుకోవాలి. దర్శకులు కూడా తమ టాలెంట్‌ను చూపించే ప్రయత్నం చేయాలి. నిర్మాతలు తాము పెడుతున్న కోట్లకు తగినవిధంగా న్యాయం జరుగుతుందా లేదా ఆలోచించాలి. ఇవన్నీ ఆలోచించకుండా సినిమా చుట్టేయాలంటే ఇలాంటి ఫలితాలే వస్తాయన్నది సినీ విశ్లేషకుల అభిప్రాయం.