హనుమ వాహనంపై ఊరేగిన శ్రీనివాసుడు
, గురువారం, 10 అక్టోబరు 2013 (14:12 IST)
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ వార్షిక ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం శ్రీనివాసుడు హనుమంత వాహనంపై నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు అయిన గురువారం.. హనుమంతుడి వాహనంపై విహరించారు. హనుమంతుని భక్తి తత్పరతను చాటిచెబుతూ, రాముడైనా, కృష్ణుడైనా, శ్రీవేంకటేశ్వరుడైనా అన్నీ తానే అని ఈ వాహనం ద్వారా స్వామి చాటి చెప్పారు. శ్రీవారి చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. అంతకుముందు అంటే బుధవారం రాత్రి శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో విశిష్టంగా పరిగణించే గరుడోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. తిరుమలేశుని బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు గరుడ వాహనంపై వెంకన్న ఊరేగే వైభవాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలివచ్చారు.సకల వేదాలకు మూలపురుషుడు, కలియుగ వైకుంఠనాథుడు మలయప్ప తన కత్యంత ఇష్టుడైన గరుత్మంతుని వాహనంగా చేసుకుని తిరుమాడ వీధుల్లో ఊరేగిన తీరు భక్తులను కనువిందు చేసింది. మూలవిరాట్టునికి మాత్రమే అలంకరించే విశేష తిరువాభరణాలతో అలంకృతుడైన వెంకన్నకు కొత్త కళ సంతరించుకుంది.నిత్యసేవల స్వామి సన్నిధిల్లో మూలమూర్తికి మాత్రమే అలంకరించే లక్ష్మీహారం, మకరకంఠి, సహస్రనామావళి హారం, ముఖ్యమంత్రి అందజేసిన కొత్త మేల్ చాట్ వస్త్రాలంకృతులతో ముస్తాబైన శ్రీవారు కొత్తపెళ్లికొడుకువోలే దర్శనమిచ్చారు.