హంసవాహనంపై సరస్వతీ రూపంలో మలయప్ప స్వామి ( వీడియో)
, గురువారం, 20 సెప్టెంబరు 2012 (00:01 IST)
దేవదేవుడయిన శ్రీవేంకటేశ్వరుడు సరస్వతీ రూపంలో విహరించారు. బుధవారం రాత్రి మలయప్ప స్వామి దేవేరులు లేకుండా విజ్ఞానదాయకుడుగా విహరించే ఘట్టం భక్తకోటికి దర్శనం ఇచ్చారు. కళ్లతో చూసి ఎంతో భక్తిగా గోవింద నామస్మరణలు చేస్తూ స్వామివారిని తరించారు. మాడవీధులన్నీ భక్తులతో కిటకిటలాడుతుండటంతో ఈ వాహనసేవకు తితిదే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. బ్రహ్మోత్సవాల్లో రెండో రోజున తిరుమల వెంకన్న మలయప్పస్వామి అవతారంలో విహరించారు. రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకూ హంసవాహనంలో తిరిగారు. మంచి గుణం, విద్య మనిషికి ఎంత అవసరమో, లేనివారికి విజ్ఞానాన్ని అందించే సరస్వతి రూపంలో మలయప్ప స్వామిగా భక్తులను ఆశీర్వదించారు. ఈ రూపంలో స్వామిని కొలిచేందుకు భక్తులు దేశవిదేశాల నుంచి ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చారు. విద్యార్థులు ఎక్కువగా ఈ సేవకు హాజరయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను తీసుకుని ఈ సేవకు వచ్చేందుకు ప్రాధాన్యం ఎక్కువగా ఇచ్చారు. దేవేరులు లేకుండా వేంకటేశ్వరుడు ఒక్కడే తిరువీధుల్లో తిరుగుతూ దర్శనం ఇచ్చారు.
ఇహలోక బంధ విముక్తుడైన జీవుని ఆత్మను హంసతో పోల్చుతారు. అలాంటి హంసపై పరమహంస అయిన శ్రీనివాసుడు ఊరేగే అద్భుతమైన దృశ్యాన్ని శ్రీవారి భక్తులు తిలకించారు. పాలు, నీళ్లు వేరు చేసినట్లే గుణగణ విచక్షణా జ్ఞానానికి సంకేతంగా మలయప్ప స్వామి ఈ వాహనంపై అధిరోహించారు. చదువుల తల్లి అవతారంలో స్వామివారు నాలుగు మాడ వీధుల్లో ఊరేగే దివ్య దృశ్యాన్ని భక్తులు కనులారా వీక్షించారు.