తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల్లో మంగళవారం ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై తిరు వీధుల్లో కలియతిరిగారు. సప్తగిరీశుడైన శ్రీనివాసుడు గోవర్ధన గిరిధారిగా సప్తాశ్వరథారూఢుడైన సూర్య వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ఆలయ రంగనాయకుల మండపంలో ఉత్సవర్లు మలయప్పను విశేష సమర్పణతో సర్వాలంకార శోభితుని చేశారు.
వాహన మండపానికి ఊరేగింపుగా వచ్చిన శ్రీవారిని సూర్యప్రభ వాహనంపై అధిష్టింపజేశారు. భక్తుల గోవిందనామస్మరణల మధ్య సూర్యప్రభ వాహనసేవ కన్నుల పండుగగా సాగింది. దేవాదాయ శాఖ మంత్రి రత్నాకరరావు, తిరుమల తిరుపతి దేవస్థాన కమిటీ ఛైర్మన్ ఆదికేశవులు, ఈవో రమణాచారి, ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి, డిప్యూటీ ఈవోలు ప్రభాకర్‌రెడ్డి, సిద్ధయ్య తదితరులు పాల్గొన్నారు.
బంగారు గొడుగు బహుకరణ
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజైన మంగళవారం కల్యాణకట్ట నాయీ బ్రాహ్మణుల సంఘం స్వామివారి మహారథానికి బంగారు గొడుగును సమర్పించారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరిగే ఈ కార్యక్రమంలో తొలుతగా కల్యాణకట్టలో బంగారు గొడుగుకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వంశపారంపర్యంగా వస్తున్న పంతులుగారి రామనాథం చేతులు మీదుగా బంగారు గొడుగును ఊరేగించారు.
అనంతరం రథంపై అలంకరించారు. ఈ కార్యక్రమంలో తితిదే ఈవో కేవి.రమణాచారి, ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు యాదయ్య, అంజయ్య, కల్యాణకట్ట డిప్యూటీ ఈవో భాస్కర్‌రెడ్డి, ఓఎస్‌డి చిన్నంగారి రమణ, బీసీ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి లక్ష్మీనారాయణయాదవ్ తదితరులు పాల్గొన్నారు.