Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సర్వభూపాల వాహనంపై వెంకన్న విహారం

Advertiesment
సర్వభూపాల వాహనంపై వెంకన్న విహారం
భూపాలురకు తానే అధిపతినని బోధించే రీతిలో తిరుమలేశుడు శనివారం రాత్రి సర్వభూపాల వాహనంపై తిరుమల మాడవీధుల్లో ఊరేగనున్నారు. మహారాజులకు తానే రారాజునని, వారిలోని అహాన్ని అణచివేసే దిశగా పరమాత్మ ఈ వాహనంపై ఊరేగుతారని శాస్త్రోక్తం.

తిరుమలేశుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగోరోజైన శనివారం రాత్రి వెంకన్న శ్రీదేవి, భూదేవి సమేతంగా తానే రారాజునంటూ మాడవీధుల్లో ఊరేగే వైభవాన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. మహారాజును పోలిన ఠీవితో అలంకార భూషితుడైన తిరుమలేశుడు అభయహస్తంతో సకల జీవరాశులకు తానే మహానాయకుడంటూ అభయ ప్రదానం చేయనున్నారు.

ఇదిలా ఉండగా... శనివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు స్వామివారికి స్నపన తిరుమంజనం వైభవోపేతంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసునికి కంకణ ధారణ చేసి స్నపన తిరుమంజనం జరిపించారు. స్నపన తిరుమంజనంలో భాగంగా వేదపఠనం, మంగళవాయిద్యాలు, గోవింద నామస్మరణలతో తిరుమల కొండ మారు మ్రోగింది.

శుద్ధ జలంతో ప్రారంభించి ధూప, దీప నైవేద్య హారతులను ఉత్సవమూర్తులకు సమర్పించారు. తరువాత ఆవుపాలతో అభిషేకం, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపుతో అభిషేకం నిర్వహించారు. అనంతరం చందనాన్ని శ్రీవారి శరీరానికి, అమ్మవార్లకు చక్కగా దిద్ది తిలకం పెట్టి తులసి మాలలను సమర్పించారు. ఘనంగా జరిగిన స్నపన తిరుమంజనం అనంతరం ఈ ఉత్సవమూర్తులను దివ్యసుందరంగా అలంకరించి, సర్వభూపాల వాహనంపై ఆసీనులు గావించి తిరుమాడ వీధుల్లో ఊరేగిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu