సంవత్సరాలు గడిచినా సంతాన ప్రాప్తి కలగని దంపతులు సంతాప ప్రాప్తికి గరుడాళ్వార్‌కు సమర్పించే కొడి పొంగల్ స్వీకరిస్తే తప్పక సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. తిరుమలేశునికి, గరుడాళ్వార్‌కు ఆదివారం నైవేద్యంగా సమర్పించిన అమృతకలశం, ఏడాదికోసారి ధ్వజారోహణంలో సమర్పించే కొడిపొంగల్‌ను భక్తి శ్రద్ధలతో స్వీకరిస్తే ఫలితముంటుందని టీటీడీ అర్చకులు చెబుతున్నారు.
తిరుమలలో శ్రీ వేంకటేశ్వర్ స్వామికి అభిముఖంగా బంగారు వాకిలిలో నమస్కార భంగిమలో కొలువై వున్న గరుత్మంతునికి ఆదివారం వేకువజామున తొలి గంట వేళలో అభిషేకం చేస్తారు. ఈ సందర్భంగా బియ్యపు పిండి, మిరియాలు, బెల్లం, ఆవునెయ్యితో కలిపిన అమృత కలశాన్ని మూలవర్లతో పాటు గరుడాళ్వార్‌కు నైవేద్యంగా సమర్పిస్తారు.
ఈ ప్రసాదాన్ని భక్తులకు కూడా వితరణ చేస్తారు. ఇలా శ్రీవారు, గరుడాళ్వార్ ఆరగించిన అమృత కలశాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం.
ఆరోగ్య ప్రదాత అయి సూర్యుడికి ఇష్టమైన ఆదివారం రోజున సంతానానితి ప్రతీక అయిన గరుడాళ్వార్‌కు వైదిక ఉపచారాలు నిర్వహించడం వల్ల ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే సంతానం, ఆరోగ్యం సిద్ధిస్తుంది. బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణంలో స్వామివారికి, గరుడ ధ్వజానికి నైవేద్యంగా సమర్పించే కొడి పొంగల్‌ను ప్రసాదంగా స్వీకరిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని టీటీడీ ప్రధాన అర్చకులు చెబుతున్నారు.