శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం : ఎల్వీ సుబ్రమణ్యం వెల్లడి
, సోమవారం, 17 సెప్టెంబరు 2012 (12:07 IST)
తిరుమలేశుని బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేసినట్టు టీటీడీ జేఈఓ ఎల్వీ సుబ్రమణ్యం వెల్లడించారు. ఈ బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై ఆయన మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ ఉత్సవాల సందర్భంగా స్వామివారికి ఆర్జిత సేవలు, వీఐపీ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రొటోకాల్ పరిధిలోని ప్రముఖులకు మాత్రం వీఐపీ టిక్కెట్లు పరిమితంగా ఇస్తామని చెప్పారు. మంగళవారం సాయంత్రం బ్రహ్మోత్సవ ధ్వజారోహణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొంటారని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరుపున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. స్వామివారి హుండీలో భక్తులు సమర్పించిన పురాతన నాణేలు, ఆలయంలో శాసనాలు, తిరుమల తీర్థాల వైశిష్ట్యాన్ని తెలిపే కరపత్రాలును సీఎం ఆవిష్కరిస్తారని చెప్పారు. భక్తులకు ప్రసాదాల కొరత ఏర్పడకుండా నాలుగు లక్షల లడ్డూలను నిల్వచేసినట్టు చెప్పారు. బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమల పరిసరాలను రూ.70 లక్షల విలువైన 30 టన్నుల బరువు గల 12 రకాల పుష్పాలను అలంకరణకు వినియోగించనున్నట్లు చెప్పారు. తిరుమలలో హోటళ్ల నిర్వాహకులు భక్తులుకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలని, లేని పక్షంలో లైసెన్స్‌లు రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు. కాగా, మంగళవారం సాయంత్రం జరిగే ధ్వజారోహణ కార్యక్రమంతో ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. మొత్తం తొమ్మిది రోజుల పాటు సాగుతాయి. ఈ బ్రహ్మోత్సవాల ప్రారంభంలో భాగంగా సోమవారం సాయంత్రం అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది.