సప్తగిరుల్లో వెలసిన కోనేటి రాయుని బ్రహ్మోత్సవాలు శుక్రవారంతో ముగియనున్నాయి. ఈ ముగింపు ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం తెల్లవారు జామున శ్రీ వేంకటేశ్వరుని చక్రస్నాన ఘట్టం వైభవంగా ముగిసింది. వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, లక్షలాది మంది భక్తజన సందోహం, గోవిందనామ స్మరణల మధ్య అత్యంత వేడుకగా శ్రీవారి చక్రస్నానం సాగింది.
బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదో రోజు ఉదయం శాస్త్రోక్తంగా ఈ చక్రస్నానాన్ని వేద పండితులు నిర్వహించారు. చక్రస్నానానికి ముందుగా శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం చూర్ణ్భాషేకం నిర్వహించారు. స్వామివారి ప్రధాన ఆలయం నుండి స్వామివారి ఉత్సవ మూర్తులను పల్లకిలో ఊరేగింపుగా వరహా స్వామి ఆలయం వద్దకు చేర్చారు. సుదర్శన చక్రాన్ని స్వామివారి వెంట ఊరేగింపుగా తీసుకువచ్చారు.
పిమ్మట వరాహాస్వామి పుష్కరిణి వద్ద ఉన్న నీటిలో సుదర్శన చక్రానికి పుణ్యస్నానం చేయించారు. ఈ దివ్య ముహూర్తం కోసం వేచివున్న భక్తులు పుష్కరిణిలో పవిత్ర స్నానాలు ఆచరించారు.
కోనేటిరాయుని చక్రస్నానంతో పాటు.. పుణ్యస్నానం చేస్తే సర్వరోగాలు, పాపాలు, రుగ్మతలు తొలగిపోతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసంగా ఉంది. కాగా రాత్రికి జరిగే ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
కాగా చక్రస్నానం వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు పాల్గొన్నారు. చక్రస్నానం వేడుకల్లో పాల్గొనేందుకు తొలిసారి 12 మంది సామాన్య భక్తులకు టీటీడీ అవకాశం కల్పించింది.
ఇదిలావుండగా, తిరుమలలో శుక్రవారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులు స్వామివారి దర్శనం కోసం 30 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వెంకన్న సర్వ దర్శనానికి 15 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతున్నట్టు సమాచారం.