వైభంగా ముగిసిన బ్రహ్మోత్సవాల ధ్వజావరోహణం
, గురువారం, 27 సెప్టెంబరు 2012 (12:25 IST)
తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగిన తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలు బుధవారం రాత్రి ధ్వజావరోహణతో పరిసమాప్తమయ్యాయి. ఎనిమిది రోజుల పాటు వివిధ వాహనాలపై ఊరేగుతూ శ్రీనివాసుడు భక్తులకు దర్శనమిచ్చారు. అలిసిపోయిన స్వామివారికి తొమ్మిదో రోజు బుధవారం ఉదయం చక్రస్నానం ఘట్టాన్ని వైభంగా నిర్వహించారు. సెప్టెంబర్ 18వ తేదీన ధ్వజారోహణ ఘట్టంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు బుధవారం నిర్వహించిన ధ్వజావరోహణంతో ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజు మలయప్పస్వామి వేణువు చేపట్టి చతుర్మాడ వీధుల్లో ఊరేగారు. అంతకుముందు ప్రధాన అర్చకులు ఆలయ మర్యాదలతో బలి నివేదన సమర్పించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి బంగారు ధ్వజస్తంభం వద్దకు వేంచేశారు. అక్కడ గరుడునికి వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపఠనం చేశారు. ధ్వజస్తంభం వద్ద ఉన్న గరుడ పటాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా కిందికి దించారు. తర్వాత ఆ పటాన్ని ధ్వజావరోహణానికి వచ్చిన శ్రీనివాసుని పాదల చెంత ఉంచారు. పిమ్మట ఊరేగింపుగా గరుడాళ్వార్ మండపానికి చేర్చి, బంగారు వాకిలిలో స్వామి వారికి శ్రవణానక్షత్ర ఆస్థానం నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయానికి రూ.26.21 కోట్ల ఆదాయం రాగా, సుమారు ఏడు లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకున్నారు.