ఈ లోకంలో ఎక్కడ వెతికినా వేంకటాద్రికి సరియైన పుణ్యక్షేత్రం లేదు. శ్రీ వేంకటేశ్వరునికి సాటియైన దేవుడు లేడు,’’ అని అంటారు. ఈ మాటలను నిజం చేసేలా జరుగుతాయి వైకుంఠనాథుడి బ్రహ్మోత్సవాలు.
అంకురార్పణతో ఆరంభమయ్యే ఉత్సవాలు ధ్వజావరోహణంతో ముగుస్తాయి. పది రోజుల పాటు కన్నులపండువగా జరిగే ఈ ఉత్సవాలను తిలకించేందుకు భారీ ఎత్తున భక్తులు తిరుమల కొండకు తరలివస్తుంటారు.
బ్రహ్మ ప్రారంభించిన ఉత్సవాలే బ్రహ్మోత్సవాలు అయ్యాయని పురాణాల కథనం. చారిత్రక ఆధారాలను బట్టి చూస్తే కొన్ని శతాబ్దాలుగా ఎందరెందరో రాజవంశీకులు ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహించినట్లు తెలుస్తోంది. వివిధ రకాల వాహనాల్లో శ్రీవారు ఊరేగుతుంటే, ఆయన ఊరేగే వైనాన్ని తిలకించేందుకు రెండు కళ్ళూ చాలవు.
వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన!
వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి!!‘‘సృష్టిలో స్థిర కారకులైన బ్రహ్మ, విష్ణుల బాంధవ్యానికి ప్రతీక బ్రహ్మోత్సవాలు. శ్రీ మహావిష్ణువు కృష్ణావతార సమాప్తి అనంతరం అర్చామూర్తిగా వెలసిన సమయంలో బ్రహ్మ తొలి ఉత్సవాన్ని జరిపించారు. బ్రహ్మ ప్రారంభించి, చేసిన ఉత్సవాలైనందున బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధికెక్కాయి. అట్టి బ్రహ్మోత్సవాలను కనులారా వీక్షించేవారికి కార్యానుసిద్ధి చేకూరుతుందని పండితులు అంటున్నారు.