వచ్చే ఏడాది తిరుమలలో రెండు బ్రహ్మోత్సవాలు!
, శుక్రవారం, 30 సెప్టెంబరు 2011 (14:40 IST)
కలియుగ వైకుంఠధామం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వచ్చే ఏడాది నుంచి రెండు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. శ్రీనివాసుడికి ఇకపై ఏడాదికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. టీటీడీ ఛైర్మన్ బాపిరాజు సలహా మేరకు సంవత్సరంలో రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించడంపై ఆగమ పండితులతో చర్చిస్తామని టీటీడీ ఈవో వెల్లడించారు. ఆగమ పండితుల సూచనల మేరకు రెండుసార్లు బ్రహ్మోత్సవాలపై నిర్ణయం తీసుకుంటామని ఆయన శుక్రవారం విలేకరులతో చెప్పారు. దీనిప్రకారం ఏడాదిలో ఉత్తరాయణం, దక్షిణాయానంలో రెండుసార్లు శ్రీవారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామన్నారు. అధిక మాసాలను పురస్కరించుకుని ప్రతి మూడేళ్లకొక సారి తిరుమల శ్రీ వెంకటేశ్వరునికి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న విషయం విదితమే. అయితే ఇకపై ప్రతి ఏడాది రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని టీటీడీ యోచిస్తోంది.