వెంకన్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడోరోజైన శుక్రవారం ముత్యపు పందిరి సేవ వైభవంగా జరుగనుంది. శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి 11 గంటల మధ్యలో ముత్యపు పందిరి వాహనంపై స్వామివారు ఆసీనులై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేస్తారు.
ముత్యాలతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన వాహనంపై అలంకారితుడైన మలయప్ప మాడవీధుల్లో విహరించే అందాన్ని తిలకించేందుకు భక్తకోటి పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్నారు.
ఇకపోతే శుక్రవారం రాత్రి ఏడుగంటల నుంచి ఎనిమిది గంటల మధ్య శ్రీవారికి ఊంజల్ సేవను నిర్వహించనున్నారు.
ఇదిలా ఉండగా, శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరుగుతున్న వాహనసేవలకు భక్తులు అశేష సంఖ్యలో తిరుమలకు తరలివస్తున్నారు. శుక్రవారం ఉదయం వైభవంగా జరిగిన సింహవాహన సేవ భక్తులను పెద్ద ఎత్తున అలరించింది.
వాహన సేవను తిలకించేందుకు వచ్చిన భక్తుల రద్దీతో వాహనం ముందుకు కదలడానికి ఎక్కువ సమయం తీసుకుంది. తిరుమాడవీధులు గోవింద నామస్మరణలతో మారు మోగుతున్నాయి.