శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి ముత్యపు పందిరి వాహన సేవ భక్తులను కనువిందు చేసింది. తిరుమలేశుడు ముత్యపు పందిరి వాహనంపై కాళీయమర్దనం అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. సర్వాలంకారణాభూషితుడైన శ్రీవారు ముత్యపు పందిరి వాహనంపై దేవేరుల సమేతంగా మాడవీధుల్లో ఊరేగిన వైభవాన్ని తిలకించేందుకు తండోపతండాలుగా భక్తులు తిరుమల కొండకు తరలి వచ్చారు.
ఈ భువిపై సకల జీవరాశులను అనుగ్రహించే ఆ పరమాత్మ ముత్యాలతో అలంకరించిన పల్లకిలో శ్రీదేవి, భూదేవిలతో కాళీయమర్దనుడి అవతారంలో భక్తులకు అనుగ్రహం ప్రసాదించారు.
ఇదిలా ఉండగా, శనివారం ఉదయం మలయప్ప స్వామి సింహవాహనంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగారు. స్వర్ణఖచిత సింహవాహనాన్ని అధిరోహించిన శ్రీనివాసుడు ధర్మరక్షణార్థం అవతరించిన నరసింహ స్వామి అవతారంలో భక్తులకు అభయమిచ్చారు.