బ్రహ్మోత్సవాల వేళ తిరుమలలో 'కంకణ ధారణ' కలహం ఏంటి?
, గురువారం, 20 సెప్టెంబరు 2012 (14:25 IST)
శ్రీవారి బ్రహ్మోత్సవాల 'కంకణ ధారణ' పెను కలహానికి దారితీసింది. ఇది టీటీడీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం మధ్య మనస్పర్థలకు దారితీసింది. చివరకు ఈ వ్యవహారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దృష్టికి వెళ్లింది. ఈ కంకణధారణ సమయంలో ఏం జరిగింది.. ఎందుకు మనస్పర్థలు వచ్చాయన్న అంశాన్ని పరిశీలిస్తే.. సాధారణంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణ కార్యక్రమానికి ముందుగా శ్రీవారి బంగారు వాకిలి వద్ద టీటీడీ ఈవో కంకరణధారణ చేస్తారు. అప్పటి నుంచి ఆయనే ఉత్సవాలను దగ్గరుండి నడిపిస్తారు. ఈ కంకణధారణ చేసిన తర్వాత బ్రహ్మోత్సవాలు పూర్తయ్యేంత వరకు తిరుమల పొలిమేరలు దాటి వెళ్లకూడదన్న నిబంధన ఉంది. ఈ ఆచారం అనాదిగా వస్తోంది. అయితే, కొందరు టీటీడీ ఛైర్మన్‌లు కంకణ ధారణ చేసినా.. మరికొందరు ఈ ఆచారాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ, టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన కాంగ్రెస్ సీనియర్ నేత కనుమూరి బాపిరాజు మాత్రం గత యేడాది అప్పటి టీటీడీ ఈవోను ఒప్పించి తాను కూడా కంకణధారణ చేసుకున్నారు. ఈ యేడాది కూడా ఈయనే ఛైర్మన్‌గా నియమితులు కావడంతో మళ్లీ కంకణధారణ చేయించుకునేందుకు ఆసక్తి చూపారు. ఈ విషయం తెలిసిన ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం సమ్మతించ లేదు. అయితే, రాజకీయ పలుకుబడిన కలిగిన కనుమూరి.. ఈవోను పక్కనబెట్టి కంకణధారణ చేయించుకున్నారు. ఇది ఇరువురి మధ్య మనస్పర్థలకు దారితీయడంతో ఈ కార్యక్రమానికి ఈవో దూరంగా ఉన్నారు. ఈ విషయం చివరకు ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లింది. ఆయన పంచాయతీతో ఈవో శాంతించి బ్రహ్మోత్సవాల్లో పాలుపంచుకుంటున్నట్టు సమాచారం.