తిరుమల సప్తగిరుల ప్రాశస్త్యమిదిగో..!!!
, గురువారం, 29 సెప్టెంబరు 2011 (12:01 IST)
శ్రీమలయప్ప స్వామి సప్తగిరుల్లో కొలువై ఉన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అయితే, ఈ ఏడు కొండల పేర్లు మాత్రం అతికొద్దిమందికి మాత్రమే తెలుసు. అనేక మందికి శేషాద్రి, గరుడాద్రి, వేంకటాద్రి, నారాయణాద్రి అనే పేర్లే ఎక్కువగా తెలిసివుంటాయి. ఈ నాలుగు గిరులతో పాటు.. అంజనాద్రి, నీలాద్రి, వృషభాద్రి గిరుల సమాహారమే తిరుమల సప్తగిరుల దివ్యక్షేత్రం. అందుకే ఇది సప్తగిరి శైలమని, ఏడు కొండల క్షేత్రమని ప్రసిద్ధి పొందింది. ఈ పుణ్యపర్వత శ్రేణుల్లో కొలువైన స్వామివారు ఏడుకొండలవాడని, సప్తగిరీశుడని కీర్తించబడుతున్నాడు. ఈ సప్తగిరుల్లో వేటికవే ఎంతో ప్రశస్త్యాన్ని కలిగివున్నాయి. శేషాద్రి ఆదిశేషుడికి, వాయుదేవునికి ఎవరు గొప్పనే వివాదం చెలరేగింది. నీకు శక్తి ఉంటే నన్ను కదుల్చు అంటూ ఆదిశేషుడు వేంకటాచలాన్ని చుట్టుకున్నాడు. వాయుదేవుడు అతణ్ని విసిరివేయగా పర్వతంతో పాటు ఇక్కడ వచ్చి పడతాడని పురాణాలు చెపుతున్నాయి. ఓడిపోయిన చింతతో ఉన్న ఆదిశేషుడిని శ్రీనివాసుడు ఓదార్చుతూ, నిన్ను ఆభరణంగా ధరిస్తాను, నీ పేరుతో ఈ క్షేత్రం ప్రసిద్ధి పొందుతుందని వరమిచ్చాడు. దాంతో ఇది శేషాచలం, శేషాద్రిగా ప్రసిద్ధి పొందింది. గరుడాద్రి శ్రీ మహావిష్ణువు హిరణ్యాక్షుని ఆదివరాహరూపంలో సంహరించి, భూదేవిని రక్షించిన తర్వాత గరుత్మంతుని పిలిచి, శ్రీ వైకుంఠానికి వెళ్లి, తన క్రీడాద్రిని తీసుకురమ్మని ఆదేశిస్తాడు. ఆయన ఆజ్ఞమేరకు గరుత్మంతుడు దాన్ని తెచ్చినందువల్లే ఇది గరుడాచలం, గరుడాద్రిగా ప్రసిద్ధి పొందింది. వేంకటాద్రి '
వేం' అనగా సమస్త పాపాలను, 'కటః' అనగా దహించునది. అంటే, పాపరాశులను భస్మం చేసేది కనుక ఈ దివ్యక్షేత్రం "వేంకటాచలం" అని పిలవబడుతున్నది. నారాయణాద్రి నారాయణుడనే భక్తుడు స్వామి పుష్కరిణి తీరాన తపస్సు చేశాడు. స్వామి ప్రత్యక్షమై వరం కోరుకొమ్మంటే... ఈ క్షేత్రం తన పేరుతో ప్రసిద్ధి పొందాలని, అందులో శ్రీనివాసుడు ప్రత్యక్షంగా భక్తులకు దర్శనమివ్వాలని ప్రార్థించాడు. అతడి కోరిక మేరకు ఈ పర్వతం నారాయణాద్రిగా పేరు పొందింది. అంజనాద్రి త్రేతాయుగంలో కేసరి అనే వానరరాజు, ఆయన భార్య అంజనాదేవికి సంతానం లేదు. మతంగముని ఆదేశం ప్రకారం అంజనాదేవి వేంకటాచల క్షేత్రంలో శ్రీవారి పుష్కరిణిలో స్నానంచేసి, వరాహస్వామిని దర్శించుకుని, ఆకాశగంగ తీర్థంలో ఉపవాసదీక్షతో వ్రతాన్ని ఆచరించింది. వాయుదేవుడు రోజూ ప్రసాదించిన ఫలాన్ని భుజించి తపస్సును కొనసాగించేది. దాంతో ఆమె గర్భాన్ని దాల్చి అనంత బలశాలి అయిన ఆంజనేయుడికి జన్మనిచ్చింది. అందుకే ఈ పర్వతం అంజనశైలం, అంజనాద్రి, అంజనాచలం అని ప్రసిద్ధి పొందింది. నీలాద్రి ఏడు కొండల స్వామికి భక్తులు తలనీలాలను మొక్కుగా చెల్లిస్తుంటారు. ఈ తలనీలాలు అనే మాట తిరుమలలో వినిపించటం వెనుక పురాణ కథనం ఉంది. స్వామివారికి తొలిసారిగా తన తలనీలాలు సమర్పించిన భక్తురాలి పేరు నీలాంబరి. ఆమె భక్తికి పరవశించిన స్వామివారు సప్తగిరిలో ఓ కొండకు ఆమె పేరు పెట్టారని ప్రతీతి. తలనీలాలు అన్న మాట ఆ భక్తురాలి పేరుపైనే అప్పటి నుండి వాడుకలోకి వచ్చింది. వృషభాద్రి పూర్వం వృషభాసురుడు అనే శివభక్తుడు బలగర్వితుడై విశృంఖలంగా సంచరించసాగాడు. శ్రీహరితోనే యుద్ధానికి తలపడ్డాడు. యుద్ధంలో శ్రీనివాసుడు సుదర్శన చక్రాన్ని సంధించాడు. దాంతో చావు తప్పదనకుని స్వామిని ప్రార్థించాడు వృషభాసురుడు. 'నీ చేతిలో మరణించడం నా మహద్భాగ్యంగా భావిస్తున్నాను' నీవు ఉన్న ఈ పర్వతానికి 'వృషభాచలం' అన్న పేరు ప్రసాదించాలని వేడుకోవడంతో, స్వామివారు ఆ వరమిచ్చి, తర్వాత అతణ్ని సంహరించాడు. అందుకే ఈ గిరికి వృషభాద్రి అనే పేరు పెట్టారు.